Deputy CM Pawan Kalyan Illness : ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో అపచారం జరిగిందంటూ శ్రీవారికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ మంగళవారం నాడు మెట్లమార్గం గుండా తిరుమల చేరుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు స్వామివారిని పవన్ కల్యాణ్ తన కుమార్తెలతో కలిసి దర్శించుకున్నారు.
పవన్ కల్యాణ్ ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనాతో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కిన ఆయన బంగారు వాకిలి నుంచి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి పంచబేరాలు, శ్రీవారి మూలవిరాట్టు విశిష్టతను పవన్ కల్యాణ్‌కు తెలియజేశారు.
Pawan Kalyan Tirumala Tour : దర్శనం అనంతరం నేరుగా రంగనాయకుల మండపానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. అక్కడ వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలికి వచ్చాక శ్రీవెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పవన్ కల్యాణ్ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాదం తయారీ విధానాన్ని అదనపు ఈవో ఆయనకు వివరించారు. అనంతరం శ్రీవారి సేవకుల వద్దకు పవన్ వెళ్లి వందనం చేశారు. ఆపై నేరుగా అతిథిగృహానికి వెళ్లారు. రాత్రి తిరుమలలో బస చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఆనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో తిరుమలలోని అతిథి గృహంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Varahi Public Meeting in Tirupati : మరోవైపు ఈరోజు సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో ఏర్పాటు చేసిన వారాహి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఆ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలను వివరించనున్నారు. తీవ్ర జ్వరంతోనే పవన్ ఈ సభకు హాజరుకానున్నారు.