Deputy CM Pawan Kalyan Speech on NDA Meeting : చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ కేవలం 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లను పెంచి చూపించామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు దార్శనికుడు, అనునిత్యం ఆశ్యర్యపరుస్తూనే ఉంటారన్నారు. ఆయనకు ఉన్న జ్ఞానాన్ని, ఓపికని చూసి ఆశ్చర్యం కలుగుతుందన్నారు. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని పవన్ వెల్లడించారు.
సీఎం చంద్రబాబును కలిసిన పవన్ కల్యాణ్ - రూ.కోటి చెక్కు అందజేత
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావు. ప్రస్తుతం ఒకటో తేదీనే అకౌంట్లలోకి జీతం పడుతుందని గుర్తు చేెశారు. అలాగే నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం రూ.1,452 కోట్లు ఇచ్చి జీవం పోశారని తెలిపారు. అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ఎంతో మంది కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్లను ఎలా మూసివేయాలనిపించిందని గత ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించి కార్మికుల క్షుద్బాధను సీఎం తీర్చారని కొనియాడారు. అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని చాలామంది సూచించారు, ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా వస్తే నన్ను చాలా ఇబ్బంది పెట్టారన్నారు. 6 నెలల్లో ప్రభుత్వం మారబోతుందని గతంలోనే అధికారులకు చెప్పానని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతోనే కలిసి పని చేశామని గుర్తు చేశారు. కూటని నేతల సమష్టి కృషితోనే ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిచామని తెలిపారు. చంద్రబాబుకు భయం లేదు, ఆయన్ని ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదని కొనియాడారు. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి, భరిస్తూ ముందుకెళ్లాలని చెప్పారు. చంద్రబాబును జైలులో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయానని పవన్ కల్యాణ్ తెలిపారు.