Dead Man is Back Incident in Vikarabad : ఓ వ్యక్తి పని కోసం వేరే గ్రామానికి వెళ్లాడు. అక్కడ పరిచయమైన వ్యక్తితో రాత్రి సమయంలో మద్యం సేవించి అక్కడే పడుకున్నాడు. ఇదే అదునుగా తనతో వచ్చిన ఇంకో వ్యక్తి అతని దగ్గర ఫోన్, డబ్బులు పట్టుకుని వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే, ఆ ప్రాంతంలో ర్వైల్వే ప్రమాదం. కుటుంబసభ్యులకు ఆ వ్యక్తి చనిపోయడని సమాచారం రావడంతో స్వగ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు మరో ట్విస్ట్. చనిపోయాడనుకున్న వ్యక్తే ఫోన్ చేశాడు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ చనిపోయిన వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా నవాంద్గీ గ్రామానికి చెందిన ఎల్లప్పకు భార్య విమలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఎల్లప్ప బషీరాబాద్‌లో పశువుల కాపరిగా పని చేసేవాడు. అక్కడ రెండు రోజుల క్రితం పని మానేసి తాండూరుకు వెళ్లి సిమెంటు బస్తాలు మోసే హమాలీగా పనిలో చేరాడు. దీంతో అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడగా, వారిద్దరూ కలిసి పని చేస్తున్న గ్రామంలోనే శనివారం సాయంత్రం మద్యం తాగారు. దీంతో ఎల్లప్ప మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పైనే పడుకున్నాడు.
చనిపోయాడని అంత్యక్రియలు- ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి- అంతా షాక్
Train Accident in Vikarabad : ఎల్లప్పతో పాటు మద్యం తాగిన వ్యక్తి ఆయన దగ్గర ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌ను తస్కరించి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆ రోజు రాత్రి వికారాబాద్ రైల్వే స్టేషన్లో పట్టాలు దాటుతుండగా ఆ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన దగ్గర రైల్వే సిబ్బంది ఆధారాల కోసం వెతకగా, సెల్‌ఫోన్ లభించింది. దీంతో కాల్‌డేటా ఆధారంగా చనిపోయిన వ్యక్తి ఎల్లప్పగా భావించి పోలీసులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. మృతదేహాం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందున కుటుంబసభ్యులు ఎల్లప్పగా భావించి అంత్యక్రియలు చేసేందుకు నవాంద్గీకి తీసుకొచ్చారు.
Dead Man is Back at Bashirabad : ఎల్లప్ప చనిపోయాడని గ్రామస్థుల ద్వారా సిమెంట్ కంపెనీ వారికి తెలిసింది. అయితే అక్కడే పని చేస్తున్న బషీరాబాద్, నవాంద్గీకి చెందిన కొందరు హమాలీలు ఆదివారం ఉదయం ఎల్లప్పను చూశారు. దీంతో అతని వద్దకు వారు వెళ్లి మాట్లాడగా, అసలు విషయం బయటపడింది. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అంత్యక్రియలు నిలిపివేయాలని చెప్పి స్వగ్రామానికి చేరుకున్నాడు. వారు తీసుకొచ్చిన మృతదేహాన్ని రైల్వే సిబ్బందికి అప్పగించారు. మృతదేహం ముక్కలు కావడంతో సరిగ్గా గుర్తుపట్టలేక ఇలా జరిగిందని రైల్వే పోలీసులు వివరించారు.
చనిపోయాడనుకుని డెత్ సర్టిఫికేట్.. 33 ఏళ్ల తర్వాత ఇంటికి.. అమ్మవారే వెళ్లమని ఆదేశించారట!