YSRCP Govt Schemes Payment Misuse to Pay Followers Bills : పేదల నిధులను వైఎస్సార్సీపీ కాంట్రాక్టర్లకు పందేరం చేసేలా అధికారులు కుట్రలు పన్నుతున్నారు. పోలింగ్‌కు ముందు పథకాల నిధుల విడుదలపై హడావుడి చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఎన్నికల ముగిసి 24 గంటలు దాటినా నోరు మెదపడం లేదు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రాదని తెలిసి, సొంత వారికి నిధులు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పేదలకు జనవరి నుంచి పెండింగ్‌లో ఉంచిన రూ. 14,165 కోట్ల డీబీటీ నిధుల చెల్లింపులు నిలిపివేసి వైఎస్సార్సీపీ కాంట్రాక్టర్లకు ఆ సొమ్ములు చెల్లించేందుకు గూడుపుఠాణి సాగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మే 13న పోలింగ్ ముగిసిన వెంటనే ఆ పథకాలకు నిధులు చెల్లించవచ్చని పచ్చజెండా ఊపింది. పోలింగ్ ముగిశాక తమ నుంచి ఎలాంటి నిరభ్యంతర పత్రమూ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే చెల్లింపులు జరపవచ్చని మే 10నే తేల్చిచెప్పింది. జనవరి నుంచి మే మొదటి వారం వరకు సంక్షేమ పథకాల సొమ్ములు లబ్ధిదారులకు చెల్లించకుండా ఆపి, సరిగ్గా పోలింగ్ ముందు చెల్లించకపోతే భూమి తిరగడమే ఆగిపోతుందన్నట్లుగా హడావుడి చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? కేవలం అధికార వైఎస్సార్సీపీ ఎన్నికల్లో మేలు చేసేందుకే సీఎస్, ఆర్థికశాఖ అధికారులు సర్వశక్తియుక్తులు ఒడ్డారని స్పష్టంగా అర్థమవుతోంది.
పోలింగ్‌కు ముందు ఆ నిధులు లబ్ధిదారులకు అందజేస్తే అధికార పార్టీకి అనుచిత లబ్ధి కలగజేసినట్లు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఐతే, వైఎస్సార్సీపీ నాయకులు అధికార పార్టీ అనుకూల వర్గాలతో హైకోర్టులో పిటిషన్లు వేయించి, విపక్షాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘంపైనా నోరు పారేసుకున్నారు. కానీ, పోలింగ్ పూర్తై 24 గంటలు గడిచినా ఇంతవరకు లబ్ధిదారులకు నిధులు జమ చేసే ప్రయత్నమే చేయలేదు. ఐతే ఎలాగూ పోలింగ్ ముగియడంతో ఆ డబ్బును వైఎస్సార్సీపీ అనుకూల కాంట్రాక్టర్ల బిల్లులకు చెల్లించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.
వాస్తవానికి ఈ డీబీటీ నిధులు ఈ రోజువి కావు. జనవరి నుంచి మార్చి 14 వరకు వివిధ సంక్షేమ పథకాల కింద జగన్ బటన్ నొక్కినట్లు బిల్డప్ ఇచ్చిన నిధులే. ఐతే పోలింగ్ ముందు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో వేయాలనే కుట్రతో మే నెల ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం అందుకు అవసరమైన నిధుల సమీకరణ ప్రయత్నాల్లో తలమునకలయింది.
YSRCP Take Loans to Pay Bills : బహిరంగ మార్కెట్ నుంచి దాదాపు రూ. 3 వేల కోట్లు సమీకరించింది. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ. 7 వేల కోట్ల సమీకరణకు ఏర్పాట్లు చేసింది. రిజర్వ్ బ్యాంకు కల్పించే వేస్ అండ్ మీన్స్ చెల్లింపుల వెసులుబాటు వినియోగించుకుని లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఎన్నికల ముందు జమ చేసి తమ పార్టీకి లబ్ధి చేకూర్చేలా చూసుకోవాలనుకున్న జగన్ పన్నాగానికి సీఎస్, ఆర్థికశాఖ అధికారులు వంత పాడారు. ఐతే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ డీబీటీ పథకాల చెల్లింపులకు అనువైన ఆర్థిక పరిస్థితి ఉన్నా లబ్ధిదారుల ఖాతాల్లో వేయలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. అప్పుడు అంతగా హడావుడి చేసిన సీఎస్ జవహర్‌రెడ్డి ఇప్పుడు చప్పుడు చేయకపోవడంలోని ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చు.
నవరత్నాల పేరుతో జగన్ నయవంచన - అసలు విషయం ఏంటంటే? - YSRCP Navaratnalu Schemes