YSRCP Irregularities Visakhapatnam : వైఎస్సార్సీపీ పాలనలో విశాఖ తీరంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగాయి. ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ విజయసాయిరెడ్డి తీరాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తొలుత సీఆర్‌జడ్ నిబంధనల ఉల్లంఘన అంటూ తెన్నేటి పార్కు నుంచి భీమిలి వరకు కొన్ని నిర్మాణాలు తొలగించారు. ఆ తర్వాత కొందరు బాధితులు వైఎస్సార్సీపీలో చేరి నజరానాలు సమర్పించుకోవడంతో తిరిగి మళ్లీ నిర్మాణాలకు అవకాశం ఇచ్చారు. దీని ఫలితంగా తీరంలో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే విరాగో పబ్ బాగోతం వెలుగులోకి వచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా భీమిలి కాపులుప్పాడ పరిధిలోని తిమ్మాపురం వద్ద విరాగో పబ్ నిర్వహిస్తున్నట్లు ఆగస్టు 27న ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ఆథారిటీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన అథారిటీ ఉల్లంఘనలు నిజమేనని తేల్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు లేఖ రాసింది. బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతులు పొంది ఏడాదిన్నరగా పబ్ నడుపుతున్నట్లు గుర్తించామని తెలిపింది.
నివాస ప్రయోజనాల కోసం జీవీఎంసీ నుంచి ప్లాన్‌ను తీసుకున్న నిర్వాహకులు వాణిజ్య కార్యకలాపాలు చేస్తున్నారని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ఆథారిటీ పేర్కొంది. 30 మీటర్ల మాస్టర్ ప్లాన్ రహదారి ఆనుకుని నిర్మాణాలున్నాయని చెప్పింది. ఖాళీ స్థలాల పన్ను రూ.20 లక్షలు కూడా చెల్లించలేదని లేఖలో వివరించింది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నప్పుడు సీ-హార్స్ బార్ నిర్మాణాన్ని తొలగించారు. ఆ తర్వాత పంచాయితీ చేసి ఆ పార్టీ నాయకులు దాన్ని లాక్కునట్లు విమర్శలున్నాయి. అప్పట్లో ఇచ్చిన ఎక్సైజ్ లైసెన్సుతోనే ప్రస్తుతం దీన్ని తిరిగి నిర్మించి బార్ పేరు మార్చి నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
CRZ Violations in Visakhapatnam : మరోవైపు శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలపై సమాచార హక్కు చట్టం కింద పట్టణ ప్రణాళికాధికారులను ఈ నెల 6న వివరణ కోరగా జీవీఎంసీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. దస్త్రం షార్ట్ ఫాల్‌లో పెట్టగా దరఖాస్తుదారు విత్ డ్రా చేసుకున్నారని వారు సమాధానం ఇచ్చారు. మరోవైపు పర్యాటకశాఖ లీజుకిచ్చిన బే-వాచ్ పార్కులోనూ సీఆర్‌జడ్ నిబంధనలు ఉల్లంఘించి వైఎస్సార్సీపీ నేతలు శాశ్వత నిర్మాణాలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపైనా చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు.
Rushikonda constructions కొనసాగుతున్న విధ్వంసం.. రుషికొండపై యథేచ్ఛగా నిర్మాణాలు