Criticism That TTD Meetings in Favor of Ruling Party: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరుమల తిరుపతి దేవస్థానం వరుస సమావేశాలు నిర్వహిస్తూ అధికార పార్టీకి అనుకూల నిర్ణయాలు తీసుకుంటోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రెండున్నర నెలల కాలంలోనే మూడుసార్లు సమావేశమైన ధర్మకర్తల మండలి హడావుడిగా తీసుకున్న నిర్ణయాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్న విమర్శలు వెల్లువెత్తినా వైసీపీ ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదు.
ఎన్నికల కోడ్ వస్తోంది- ఇకపై తిరుమలలో వీఐపీ దర్శనాలు బంద్!
రెండున్నర నెలల సమయంలో మూడు సమావేశాలు నిర్వహించిన ధర్మకర్తల మండలి చేసిన తీర్మానాలన్నీ వైసీపీ నేతలకు లబ్ధి చేకూర్చేవేనని భక్తులు, విపక్షనేతలు విమర్శిస్తున్నారు. జనవరి 29, ఫిబ్రవరి 26, మార్చి 11న ధర్మకర్తల మండలి సమావేశమైంది. 30 ఏళ్ల క్రితం గడువు ముగిసిన వీధి వ్యాపారుల లైసెన్సుల పునరుద్ధరణ అంశం పరిశీలనకు ఫిబ్రవరి సమావేశంలో కమిటీ ఏర్పాటు చేస్తూ తీర్మానం చేశారు. మార్చి 11వ తేదిన సమావేశంలో లైసెన్స్‌లు పునరుద్ధరిస్తూ తీర్మానం చేశారు. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా 400 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు టైమ్ స్కేల్ (Time Scale) వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు భారీగా కమీషన్లు తెచ్చిపెట్టే ఇంజినీరింగ్ పనులకూ పెద్ద ఎత్తున అనుమతులు ఇస్తూ తీర్మానాలు చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం తిరుమల దేవస్థానం వైసీపీ పార్టీకి ఆదాయ వనరులుగా మారిపోయింది. ధార్మిక క్షేత్రాన్ని వైసీపీ పార్టీ ధనదాయ క్షేత్రంగా మార్చుకోవడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా వెంట వెెంటనే ధర్మకర్తల మండలి సమావేశాలు పెడుతున్నారు. టీటీడీ దేవస్థానం ఉండేది భక్తుల కోసమా లేక రాజకీయ నేతల కోసమా?. గత ధర్మకర్తల మండలిలో షాపులు కేటాయించినప్పుడు కోట్ల రూపాయలు చేతులు మారడం జరిగింది. -భానుప్రకాశ్‌రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు
150 మంది వీధి వ్యాపారుల లైసెన్సుల పునరుద్ధరనకు ధర్మకర్తల మండలి ఆమోదించగా వాటిలో 90 వరకూ వైసీపీకు చెందిన వారివే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ధర్మకర్తల మండలి సమావేశాలు సాధారణంగా రెండు నెలలకు ఒకసారి జరుగుతాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు నెలల్లోనే మూడుసార్లు సమావేశం ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ధర్మకర్త మండలి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఇంజినీరింగ్ కాంట్రాక్టు పనులను ఆదాయ వనరుగా మార్చుకున్న అధికార పార్టీ ముఖ్యనేత పాలక మండలిని అడ్డుపెట్టుకుని నిర్మాణ పనులు ప్రతిపాదించి వాటికి అనుమతులు పొందారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
దైవసన్నిధిలో వ్యక్తిగత కక్షలతో వ్యవహరిస్తున్నారు- టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ నేత ఆగ్రహం