Cooking Oil Prices Increased : వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించటంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచారు. లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. శనివారం ఉదయం లీటరుకు రూ.115గా ఉన్న పొద్దు తిరుగుడు నూనె ధర, సాయంత్రానికి రూ.130కి పైగా చేరింది. చిల్లర దుకాణాల్లో ఎక్కువే అమ్ముతున్నారు. పామోలిన్ ధర లీటరు రూ.115 అయింది.
Central Govt Hikes Import Duty Edible Oils : కేంద్రం ముడి పామోలిన్, సోయా, పొద్దు తిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దుకాణాల్లో అన్ని రకాల వంట నూనెల ధరలనూ భారీగా పెంచారు. పూజకు ఉపయోగించే నూనె ధర కూడా లీటరుకు రూ.15కు పైగా పెరిగింది. నగరాలు, పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు, ఆన్‌లైన్ విక్రయ సంస్థలు కూడా ధరల్ని అమాంతం పెంచాయి. కొన్ని చోట్ల నిల్వలను నల్లబజారుకు తరలించారు. స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. లీటరు పామోలిన్ ధర రూ.165కు చేరగా, పొద్దు తిరుగుడు నూనె ధర రూ.200 వరకు ఎగసింది.
ధరల పెంపు - వినియోగదారులు ఆగ్రహం : వంట నూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న సరకును కూడా ఎక్కువ ధరలకు విక్రయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్లో మరింత పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పామోలిన్ రేేట్ హోల్‌సేల్‌లో లీటరు రూ.110 అమ్ముతుండగా చిల్లరగా రూ.115 చొప్పున విక్రయిస్తున్నారు. పొద్దుతిరుగుడు నూనె కొన్ని చిల్లర దుకాణాల్లో లీటరు రూ.140 చొప్పున విక్రయిస్తుండటం గమనార్హం. పూజలకు ఉపయోగించే వివిధ రకాల నూనెల లీటరు ధర మొన్నటి వరకు రూ.109 వరకు ఉండగా, అవి ఇప్పుడు రూ.120కి చేరాయి.
ప్రధాన కంపెనీల నుంచి మూడు రోజులుగా లోడింగ్ కూడా నిలిచిపోయిందని వ్యాపారులు అంటున్నారు. వంట నూనెల ధరలు శనివారం ఉదయం వరకు, ఎమ్మార్పీ కంటే తక్కువగా ఉన్నాయి. దిగుమతి సుంకం పెంపుదలపై ప్రకటన రావడంతో ఎక్కడికక్కడ ధరలు పెంచారు. ఎమ్మార్పీ ఎంత ఉంటే అంతే ధర నిర్ణయించారు. ఆన్‌లైన్ సంస్థల్లోనూ కొద్ది సేపు వంట నూనెల అమ్మకాలను నిలిపివేసి, పెంచిన ధరలతో సవరించాయి.