Construction Workers Problem in YSRCP Govt: రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వారం మొత్తం పని లేక నిర్మాణ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. గతంలో వారమంతా పని ఉండేదని ప్రస్తుతం వారానికి మూడు, నాలుగు రోజులు మాత్రమే పని ఉంటోందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో జగన్ సర్కార్ కొలువుదీరాక పాత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది. దీంతో నేటికీ ఇసుక కొరతతో ఉపాధి కరువై అనేక మంది నిర్మాణ రంగ కార్మికులు అవస్థలు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక అనేక మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం భవన నిర్మాణానికి అవసరమయ్యే సామాగ్రి ధరలు పెరిగాయి. దీంతో నిర్మాణ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిన జగన్ సర్కార్ - నాలుగున్నరేళ్లుగా నానావస్థలు
గత ప్రభుత్వాల హయాంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చి అనేక మంది భవన నిర్మాణ కార్మికులు జీవనం సాగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి రోజురోజుకు కనుమరుగవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావడం ఆగిపోయి మన రాష్ట్రం నుంచే ఇతర రాష్ట్రాలకు ఉపాధిరీత్యా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లిపోతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీలో జగన్ సర్కార్ కొలువుదీరాక పాత ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త ఇసుక విధానం తీసుకొచ్చింది.
ఈ క్రమంలో చోటు చేసుకున్న జాప్యంతో రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరతకు కారణమైంది. దీంతో నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నేటికీ నూతన ఇసుక పాలసీ కారణంగా రాష్ట్రంలోని నిర్మాణ రంగం అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది నిర్మాణ రంగ కార్మికులు పనుల్లేక, పస్తులుండలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. ఉపాధి లేక ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 70 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.
బాపట్ల జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు - ఎన్జీటీ ఆదేశాలు బేఖాతరు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు రెండున్నర లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటారని అంచనా. ఒక్క విజయవాడలోనే 25వేల మంది వరకు ఉన్నారు. భవన నిర్మాణ రంగంపై 26 రకాల వృత్తుల వాళ్లు ఆధారపడి జీవిస్తున్నారు. తాపీ పని చేసే కార్మికులు, ప్లంబర్ పని చేసేవాళ్లు, వడ్రంగి పని చేసే కార్మికులు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసే వాళ్లు , సీలింగ్ , పుట్టీ పనులు, పెయింటింగ్ పనులు వంటివి చేస్తూ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది బతుకుతున్నారు. సిమెంట్, ఇరన్, ఇసుక, ఇటుకలు, రాళ్లు, చెక్క వంటి భవన నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ధరలు గతంతో పోలిస్తే ప్రస్తుతం విపరీతంగా పెరిగాయి.
భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత కాంక్రీట్ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం
గత ప్రభుత్వాల హయాంలో భవన నిర్మాణ కార్మికుడు మరణిస్తే మట్టి ఖర్చుల పేరుతో 20వేల రూపాయలు ఇచ్చేవారు. ప్రస్తుతం జగన్ సర్కార్ దాన్ని అటకెక్కించింది. భవన నిర్మాణ సంక్షేమ బోర్డులోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణకు ఖర్చు చేయడం లేదని కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. రాజధాని పనులు ఆగిపోవడం, కొత్త ఇసుక విధానం, సామగ్రి ధరలు పెరగడం వంటి కారణాలతో కష్టాల కడలిని ఈదాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. తమపై ప్రభుత్వాలు కరుణ చూపాలని వేడుకుంటున్నారు.