Constable Attempted Suicide Due to YSRCP Leader Harassment: సామాన్య ప్రజలకు సమస్యలుంటే పోలీసులకు చెప్పుకుంటారు. మరి పోలీసులకే కష్టమొస్తే ఎవరికి చెప్పుకుంటారు. అది కూడా పైఅధికారుల నుంచో లేక రాజకీయ నేతల నుంచో వస్తే ఆ బాధ ఎవరితో పంచుకోవాలి, ఎలా చెప్పుకోవాలి. ధైర్యం ఉన్నవాళ్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోవడమో, లేదా సెలవు పెట్టడమో చేస్తుంటారు. ధైర్యం లేనివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో గత వైఎస్సార్సీపీ హయాంలో అధినేత జగన్ అండతో పెద్ద పెద్ద నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఇష్టానుసారంగా సామాన్యులను వేధించేవారు. తమకు వ్యతిరేకంగా ఉంటే అది ఎలాంటి వారైనా సరే వారికి వేధింపులు, అక్రమ కేసులు తప్పవు. ఇలా జగన్ ఐదేళ్ల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. ఇటీవల ముంబయి నటి విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. వారికి కావాల్సిందల్లా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి వారి దారిలోకి తెచ్చుకోవడమే. వారి ఇబ్బందులు తట్టుకోలేక ఎంతో మంది సామాన్యులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
వైఎస్సార్సీపీ నాయకులు పెడుతున్న ఇబ్బందుల గురించి ఎవరికి చెప్పినా పట్టించుకోకపొవడంతో చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అరాచకాలు చేశారు. కానీ అధికారం పోయినా సరే వారి వేధింపులు మాత్రం ఎక్కడికక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలానే వైఎస్సార్సీపీ నేత వేధింపులతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
అప్పు తీర్చలేక: నెల్లూరు జిల్లా సంగం మండలం పడమటిపాలెంలో వైఎస్సార్సీపీ నేత వేధింపులతో కానిస్టేబుల్ రమేశ్ అనే వ్యక్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పడమటిపాలెంలో వైఎస్సార్సీపీ జడ్పీటీసీ భర్త ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి దగ్గర పంట వేసుకునేందుకు అప్పు తీసుకున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోవడంతో అప్పు తీర్చలేకపోయారు. ఈ క్రమంలో అప్పు తీర్చకపోవడంతో రమేశ్‌ను ప్రసాద్‌గౌడ్ ఇబ్బందులకు గురి చేశారు. ప్రసాద్‌గౌడ్ వేధింపులు తాళలేక కానిస్టేబుల్ రమేశ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. కాగా రమేశ్‌ను నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.