Conjoined Twins Veena-Vani : అవిభక్త కవలలు వీణ-వాణిలు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. పుట్టుకతోనే తలలు అతుక్కుని జన్మించిన వీరు నూతన సాంకేతిక వైద్యరంగానికే సవాలుగా నిలిచి విడదీయరాని బంధంగా నిలిచారు. బుధవారం ఈ అవిభక్త కవలలు 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని శిశు విహార్‌లోనే వీరికి ఏటా బర్త్ డే నిర్వహించేవారు. తొలిసారి వీరు తమ స్వగ్రామంలో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వీరి స్వగ్రామం తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడెం. మారగాని మురళి-నాగలక్ష్మి దంపతులకు 2003 అక్టోబర్ 16న సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వీరు జన్మించారు. పుట్టుకతోనే వీరు రెండు తలలు అతుక్కుని జన్మించారు. వీరికి గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు నాయుడమ్మ వైద్య చికిత్స అందించారు. వీరికి ఆపరేషన్ చేసి వేరు చేసేందుకు దేశ విదేశీ వైద్యులు వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విడదీయని వీరి బంధానికి సరిగ్గా నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. వీరు నీలోఫర్ ఆసుపత్రిలోనే 13 ఏళ్ల దాకా ఉన్నారు. తర్వాత హైదరాబాద్‌లోని స్టేట్ హోం వీరికి నివాసంగా మారింది. గత 21 సంవత్సరాలుగా అక్కడే జన్మదిన వేడుకలను జరుపుకున్న ఈ కవలలు తొలిసారిగా తమ సొంతూరైన బీరిశెట్టి గూడెం గ్రామానికి వచ్చారు.
సంక్లిక్షమైన సర్జరీ : వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్ వంటి దేశానికి చెందిన వైద్యులు వచ్చి అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. అయితే సర్జరీ సంక్లిష్టమైనది కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో వీరి ఆపరేషన్ అలాగే ఏళ్ల తరబడి నిలిచిపోయిందని తల్లిదండ్రులు వాపోయారు. ప్రస్తుతం వీరు యూసఫ్‌గూడలోని స్టేట్ హోంలో ఉంచారు. ఇరువురు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు.
ప్రభుత్వ సంరక్షణలోనే: వీరికి అన్ని రకాల సేవలు, ఆలనా పాలనా అక్కడ స్టేట్ హోం వారే చూస్తున్నారు. గతేడాది వీణవాణీలు తమ సొంతూరు బీరిశెట్టిగూడెం వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లారు. తమ పిల్లలకు ఆపరేషన్ చేయాలని అన్ని ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమ పిల్లలతో కలిసి ఉండేందుకైనా ప్రభుత్వం అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
22 ఏళ్ల తర్వాత వీణా-వాణి తమ వద్దకు రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు బంధువులు సైతం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. తమ సొంత గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని కవలలు వీణా-వాణిలు ఆనందం వ్యక్తం చేశారు.
కవలల కనువిందు - రెండు పాఠశాలల్లో 32 జంటలు
అప్పుడు ఒకే కాన్పులో జననం- ఇప్పుడు ఒకే గేమ్‌లో పతకాల పంట- త్రీ సిస్టర్స్ కథ ఇదీ!