Telangana Congress Joining Problems : బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అధికారాల కోసం ఒత్తిడి తీసుకువస్తుండటంతో కాంగ్రెస్‌కి కొత్తచిక్కులు వస్తున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు, పదిమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. మరి కొందరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు. ఐతే బీఆర్‌ఎస్‌కు ఉన్న 38 మంది ఎమ్మెల్యేల్లో 26 మందిని చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Discontent of Telangana Congress MLAs : హస్తం కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పెత్తనం తమకే ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఐతే పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో నియోజకవర్గాలవారీగా సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓడిపోయిన నియోజకవర్గాల్లో పోటీచేసిన నాయకులే ఇంఛార్జీలని ప్రకటించారు. ఆ నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి చెందిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలని స్పష్టంచేశారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు జరిగినప్పటి నుంచి ఆయా నియోజక వర్గాల్లో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సొంత పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు : ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నియోజకవర్గంలో తగిన గౌరవం లభించడం లేదని తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఇప్పటికీ ఓటమిపాలైన సరిత తిరుపతయ్య ఇంఛార్జీగా కొనసాగుతుండడం కృష్ణమోహన్ రెడ్డి మాట ఎక్కడ చెల్లుబాటు కాకపోవడంతో బీఆర్‌ఎస్ నాయకులను కలిసి తానూ తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడించారు. అప్రమత్తమైన కాంగ్రెస్ మరుసటి రోజు హైదరాబాద్‌లో పోచారం ఇంట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సమావేశానికి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరుకాకపోవడంతో మరుసటిరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల్‌లో కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపగా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పినట్లు సమాచారం.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం : కొన్నిచోట్ల బీఆర్‌ఎస్ నుంచి చేరిన నాయకులు, స్థానిక కాంగ్రెస్ నేతలమధ్య సయోధ్య కుదరట్లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడుతుందని రాష్ట్రనాయకత్వం ఆందోళన చెందుతోంది. ఈ తరుణంలో చేరికల విషయంలో స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని ముందుకు వెళ్లాలని పార్టీనాయకత్వం సూచిస్తోంది. అవసరమైన చోట కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం ఉండేలా చూడాలని, ఓటమిపాలైన నేతలతో కలిసి ముందుకెళ్లాలని సూచించింది.
బుజ్జగిస్తున్న కాంగ్రెస్ పెద్దలు : ఇదే సమయంలో పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రాధాన్యమివ్వాలని యంత్రాంగానికి సూచించడంతో సమస్య తాత్కాలికంగా సర్దుమణిగిందని తెలుస్తోంది. ఐతే కొన్నిచోట్ల గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పినా పనులు అవుతుండడంతో పార్టీనుంచి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బయటపార్టీ నుంచి వచ్చిన వారికి అధికారం చెలాయించేందుకు అవకాశం ఇచ్చి సొంత నేతల్ని చిన్నచూపు చూడడంతో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.