Telangana Full Scale Budget 2024 : శాసనసభ బడ్జెట్ సమావేశాలు నాలుగో వారంలో ప్రారంభం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 4నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ పద్దు సమర్పించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించే పనిలో నిమగ్నమైంది. ఈనెలాఖరుతో తాత్కాలికపద్దు గడువు ముగియనుండగా, వార్షిక బడ్జెట్‌పై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఆర్థికశాఖ ఇప్పటికే అన్నిశాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకోగా, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క విభాగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇక ఓటాన్ అకౌంట్ సమయంలోనే బడ్జెట్‌పై పూర్తిస్థాయి కసరత్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలపై ఓ అంచనాకు వచ్చారు. బడ్జెట్‌లో నిర్వహణ పద్దు, ప్రగతి పద్దు ఉంటాయి. నిర్వహణ పద్దుకు సంబంధించి, గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు, త్వరలో సమర్పించే పద్దులో పెద్దగా మార్పులుండవు. ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల విషయమై ప్రగతి పద్దుకు సంబంధించి మాత్రమే, ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకొన్నారు. అది కూడా ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఇచ్చిన హామీలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన మార్పులు చేర్పులు ప్రతిపాదించారు.
ఏపీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భవనాల స్వాధీనం కోసం నివేదిక సిద్ధం చేయండి : మంత్రి కోమటిరెడ్డి
కేంద్ర ప్రభుత్వం సమర్పించే వార్షిక బడ్జెట్‌తో, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాలకు సంబంధించి ఇప్పటికే స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి కూడా పెద్దగా మార్పులు ఉండకపోచ్చని సమాచారం. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాకు సంబంధించి కొంతవరకు అంచనాలు మారవచ్చని, ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం ఈనెల 22న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే రాష్ట్రపద్దులో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులు కేటాయించడం కీలకం కానుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల పద్దులపై ఓ అంచనాకు రానున్నారు.
ఓటాన్ అకౌంట్ పద్దులో 6 గ్యారంటీలకు ఉజ్జాయింపుగా 53,196కోట్లు ప్రతిపాదించారు. రైతుభరోసాకు 15వేల కోట్లు, పింఛన్లకు ఉద్దేశించిన చేయూత పథకానికి 14,800 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు 7740 కోట్లు కేటాయించారు. మహిళలకు నెలనెలా ఇచ్చే 2500రూపాయల ఆర్థికసాయం అందించే మహాలక్ష్మి పథకానికి 7230కోట్లు ప్రతిపాదించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం 4084కోట్లు, నెలకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి 2418 కోట్లు ప్రతిపాదించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 1065 కోట్లు, 500రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి 723కోట్లు కేటాయించారు. ఉద్యోగ నియామకాల కోసం వెయ్యి కోట్లు, రైతు రుణ మాఫీ కోసం 10వేల కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసా విధి విధానాల కోసం ఏర్పాటైన మంత్రివర్గఉపసంఘం సిఫార్సుల మేరకు అవసరమైన కేటాయింపులు చేయనున్నారు. మిగిలిన గ్యారెంటీల అమలు, ఇటీవల ఇచ్చిన హామీలకు తగ్గట్లుగా పూర్తిస్థాయి బడ్జెట్ సిద్ధం కానుంది.
రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు - ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి