Complaints on Former APSBCL MD Vasudeva Reddy: మద్యం అక్రమాల వ్యవహారంలో ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. వాసుదేవరెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలపై అందుతున్న ఫిర్యాదుల్ని విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సీఐడీకి బదిలీ చేస్తోంది. మద్యం కొనుగోళ్లు, టెండర్లు, విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు వాసుదేవరెడ్డిపై ఫిర్యాదులు అందుతున్నాయి.
నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ విక్రయాలను ప్రభుత్వ దుకాణాల ద్వారా జరిపించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అవి ఎంత మేర జరిగాయన్న దానిపై విచారణ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గడచిన ఐదేళ్లలో 99 వేల కోట్ల రూపాయల మేర నగదుగా మద్యం విక్రయాలు ఎందుకు జరిపారన్న అంశంపై వాసుదేవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. నకిలీ హోలోగ్రామ్‌లు అంటించిన మద్యం బాటిళ్లను కూడా మద్యం దుకాణాల ద్వారా విక్రయించి ఆ సొమ్మును దారిమళ్లించారని ప్రాథమిక విచారణలో వెల్లడవుతోంది.
అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, డిస్టిలరీల నుంచి అక్రమమార్గాల్లో వచ్చిన నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ వ్యవహారంపై కూడా వాసుదేవరెడ్డి కనుసన్నల్లో జరిగినట్టు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ పెద్దల కనుసన్నల్లోనే నడిచి మద్యంలో పెద్ద ఎత్తున అక్రమాలకు వాసుదేవరెడ్డి పాల్పడినట్టుగా స్పష్టమవుతోంది.
ఇప్పటికే ఎక్సైజ్ శాఖలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోలోగ్రామ్ టెండర్లు చేపట్టినట్లు, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే టెండర్లు ఇచ్చినట్లు సమాచారం. హోలోగ్రామ్ కంపెనీలకు ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టినట్లు ఇప్పటికే విచారణలో తేటతెల్లమైంది.
మరోవైపు ప్రభుత్వానికి రిపోర్టు చేయకుండా ఇప్పటికీ వాసుదేవరెడ్డి పరారీలోనే ఉన్నారు. సీఐడీ ఇచ్చిన 41 ఏ నోటీసు ద్వారా విచారణకూ వాసుదేవరెడ్డి గైర్హాజరయ్యారు. దాదాపు రెండు నెలలుగా పరారీలోనే ఉన్నారు. గత జూన్ నెల 7వ తేదీన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించిన సమయానికే వాసుదేవరెడ్డి తప్పించుకున్నారు. అప్పటి నుంచి సీఐడీ బృందాలు ఆయన కోసం గాలిస్తున్నాయి.
జగన్ ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు సూత్రధారులుగా సాగించిన మద్యం కుంభకోణంలో ఏపీఎస్‌బీసీఎల్ (Andhra Pradesh State Beverages Corporation Limited) మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కీలక పాత్రధారిగా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత వైఎస్సార్సీపీలో జరిగిన దోపిడీకి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను సైతం వాసుదేవరెడ్డి మాయం చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లు ఇప్పటికే సీఐడీ గుర్తించింది.