Clashes Between Two Groups in Komaram Bheem Asifabad : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం సహా ఒకరి దుకాణాలు మరొకరు ధ్వంసం చేసుకున్నారు. ఓ మహిళపై దాడిని నిరసిస్తూ మొదలైన గొడవలు చివరకు రణరంగంగా మారాయి. ప్రస్తుతానికి పరిస్థితి సద్ధుమణిగినట్లు కనిపిస్తున్నా ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. పూర్తిస్థాయిలో నిర్బంధ ఆంక్షలు విధించినా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోకుండా బీఎస్‌ఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఆటోడ్రైవర్ దాడిలో గాయపడి గాంధీలో చికిత్స పొందుతున్న మహిళను మంత్రి సీతక్క పరామర్శించారు. నిందితుడిని అరెస్టు చేశామని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారంపై డీజీపీకి కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి ఆరా తీశారు. నిందితుడిని కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనపై డీజీపీతో మాట్లాడినట్లు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఇందుకు కారణమైనా ఎవరున్నా కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.