Commencement of Boat Cutting Process at Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ రెండోరోజూ కొనసాగుతోంది. పడవలు చిక్కుకుని కదలకపోవడంతో వాటిని ముక్కలు చేయాలని నిర్ణయించారు. పడవలను తొలగించేందుకు విశాఖ నుంచి 10 మంది సభ్యులతో కూడిన స్కూబా డైవింగ్ టీమ్ ప్రకాశం బ్యారేజ్‌కు వచ్చింది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను రెండు ముక్కలుగా చేయనున్నారు. ఆధునిక పరికరాలతో నదిలోకి వెళ్లి పడవలను ముక్కలుగా కోస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని స్కూబా డైవింగ్ చేస్తూ బోట్లను కోస్తున్నారు. పడవలు తొలగించేందుకు 3 రోజుల సమయం పడుతుందంటున్నారు.
నిన్న భారీ క్రేన్లతో పడవలను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కొక్కటి 40 టన్నుల బరువున్న 3 భారీ పడవలు సహా ఓ మోస్తరు బరువు ఉన్నమరో పడవ కలిపి మొత్తం4 చిక్కుకుని కదలక పోవడంతో పడవలను ముక్కలుగా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో నది లోపలికి దిగి పడవలను గ్యాస్ కట్టర్లతో ముక్కలు చేసే డైవింగ్ టీంలను అక్కడికి రప్పించారు.
ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీకి చేరుకున్న విశాఖ నుంచి వచ్చిన పదిమంది సభ్యుల డైవింగ్ టీం వెంటనే రంగంలోకి దిగారు. ఆధునిక పరికరాలతో నది లోపలికి వెళ్లి భారీ పడవలను రెండు ముక్కలుగా కోసే పని ప్రారంభించారు. గతంలో పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోయినపుడూ అలాగే పలు చోట్ల ఈ తరహా పనులు సమర్థంగా చేసిన అనుభవం ఉన్న సీ లయన్ అనే సంస్థకు చెందిన డైవింగ్ టీం యుద్ద ప్రాతిపదికన పనులు చేస్తున్నారు.
'ఆక్సిజన్ సిలిండర్లు వీపునకు తగిలించుకుని వేసుకుని స్కూబా డైవింగ్ చేస్తూ నది లోపల 12అడుగులు లోతుకు వెళ్లిన సభ్యులు కట్టర్లతో బోట్లను ముక్కలుగా కోస్తారు. ఒక్కోసారి ఇద్దరు చొప్పన వెళ్లి గంట పాటు కటింగ్ చేనున్నారు. వంతుల వారీగా పది మంది సభ్యులు నదిలో నీటిలోకి వెళ్లి నీటిలోనే బోట్లను కోయనున్నారు. సాయంత్రానికి ఒక పడవను తొలగించే అవకాశం ఉంది.' - డైవింగ్ టీం సూపర్ వైజర్
ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి వేగంగా పడవలను తొలగించాలని ఇంజినీర్లు, అధికారులను ఆదేశించారు. రోజుకు ఒక బోటు చొప్పున కనీసం 3 రోజుల పాటు పడవలను కోసే పనులు జరపాల్సి ఉంటుందని ఇంజినీర్లు, సూపర్ వైజర్లు తెలిపారు.