Coastal Erosion in East Godavari : ఉదయాన్నే నిద్ర లేచి, తలుపులు తెరిచి అలా అడుగు బయట పెట్టగానే అలలు కనిపిస్తే ఎవరికైనా ఒక్కసారిగా గుండె జారక మానదు. అలాంటి భయానక పరిస్థితులను చాలా ఏళ్లుగా అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్నారు. సముద్రం నుంచి ముందుకొస్తున్న కెరటాలు తమ భూములను, ఇళ్లను ముంచేసి సాగర గర్భంలో కలిపేసుకుంటుంటే మౌనంగా రోదించడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి వారిది. గంగమ్మనే నమ్ముకుని జీవితం గడుపుతూ మత్స్యకార కుటుంబాలు కష్టాలకు ఎదురొడ్డి బతుకు నావ నడిపిస్తున్నాయి. ఓ వైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు మానవ తప్పిదాలే కోత తీవ్రత, నానాటికీ పెరగడానికి కారణమన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితే కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో పలు గ్రామాలను వేధిస్తున్న ప్రధాన సమస్య. సాగర సమీప పల్లెల్లో ప్రజలకు జీవనాధారమైన భూములు, ఉప్పాడలో నివాసాలు సముద్రంలో కలిసిపోతుండడం తీవ్రంగా కలవరపెడుతోంది.
ఏమయ్యాయి ఆ ఇళ్లు, రోడ్లు : అక్కడో ఇల్లుండేది. కానీ ఇప్పుడు లేదు. అక్కడో గుడి ఉండేది. ఇప్పుడు లేదు. గతంలో ఉన్న ఎత్తెన భవనాలు, విశాలమైన రోడ్లు, తాగునీటి వనరుల జాడే లేకుండా పోయింది. సముద్రుడు క్రమేపీ ముందుకొస్తుండడంతో వేల ఎకరాల భూములు, నిర్మాణాలూ దానిలో కలిసిపోతున్నాయి. 1956 నాటికి ఉప్పాడ తీరంలో 23.84 ఎకరాలు కోతకు గురైనట్లు గుర్తిస్తే అప్పట్నుంచి ఇప్పటివరకు మరో 60.67 ఎకరాలు సముద్రంలో కలిసిపోయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
ఆ తప్పు, ఇక్కడ ముప్పు : సాగరం పోటు సమయంలో ముందుకు దూసుకొచ్చి అలలు తీరాన్ని కోతకు గురిచేస్తూ నివాసాలను ధ్వంసం చేస్తుండడమే తీరప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్య. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో కొమరిగిరి నుంచి కోనపాపపేట వరకు 15 కిలోమీటర్ మేర తీరం ఉంటే సమస్య తీవ్రత ఉప్పాడలో అధికం. గత అయిదేళ్లలో 400 ఇళ్లు సాగరంలో కలిసిపోయాయి. సర్వం కోల్పోయి మత్స్యకారులు ఇతరుల ఇళ్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి. సముద్రతీరం కోతకు గురవకుండా రాళ్లు వేస్తున్నా12 కోట్లు రూపాయలు వెచ్చించి జియోట్యూబ్, గేబియన్ బాక్సులు వేసినా ఈ పనులు సమర్థంగా సాగకపోవడంతో సమస్య మొదటికొచ్చింది.
కాకినాడ పోర్టులో నౌకల రాకపోకలకు వీలుగా డ్రెడ్జింగ్ (Dredging) చేస్తుంటారు. ఏటా 10,00,000 క్యూబిక్ మీటర్లు తవ్వి కోత సమస్య ఉన్న ఉప్పాడ తీరంలో వేయకుండా సముద్రం లోపలే పడేస్తున్నారు. విశాఖ తరహాలో పైపుల ద్వారా ఉప్పాడ తీరానికి తరలించి 6,00,000 క్యూబిక్ మీటర్లు ఇసుక వేస్తే కోత ఆగేది. అలానే రక్షణ గోడల నిర్మాణం జరిగితే శాశ్వత పరిష్కరమూ కలుగుతుంది.
ఎన్‌సీసీఆర్ అధ్యయనం ఏం చెబుతుందంటే : నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్స్ (NCCR) ఉపగ్రహ, క్షేత్రస్థాయి సర్వే సమాచారం ఆధారంగా తీరం వెంట మార్పులపై అధ్యయనం చేసింది. 1990-2018 మధ్య ప్రధాన భూభాగంలో 6,907.18 కిలోమీటర్లు తీరాన్ని మ్యాప్ చేసింది. 28.7% తీరం కోతకు గురైందని 21.7% స్థిరంగా ఉందని గుర్తించింది. సమస్యాత్మక మండలాల జాబితాలో కొత్తపల్లి, సఖినేటిపల్లి తీర ప్రాంతాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సూచన మేరకు చెన్నైకి చెందిన ఎన్‌సీఆర్ నిపుణుల బృందం (NCR Expert Team) ఉప్పాడ తీరంలో కోత కట్టడికి 20 సంవత్సాలకు సరిపడా ప్రణాళిక సిద్ధంచేసింది. తీవ్రత ఉన్నచోట రక్షణ గోడ, ఉప్పాడ వద్ద గ్రోయన్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయల నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఊతమిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
తీర ప్రాంతాల్లో స్వచ్ఛతపై యానిమల్ వారియర్స్ కృషి
గ్రామం కోతకు గురైన ప్రాంతం (ఎకరాల్లో) : ఉప్పాడలో కోతకు గురైన విస్తీర్ణం 84.51 ఎకరాలు. ఇందులో 1956 సంవత్సరం వరకు 28.34 ఎకరాలు కోతకు గురైనది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు 60.67 ఎకరాలు తీర కోతకు గురయ్యింది.
క్రమ సంఖ్య | గ్రామం | ఎకరాలు |
1 | కొమరగిరి | 362.83 |
2 | మూలపేట | 359.78 |
3 | కోనపాపపేట | 233.56 |
4 | సుబ్బమ్మపేట | 141.30 |
5 | అమరవిల్లి | 133.50 |
6 | ఉప్పాడ | 84.51 |
7 | అమీనాబాద్ | 32.26 |
8 | రమణక్కపేట | 13.01 |
మొత్తం | 1,360.75 |
ఇలా చేస్తే మనకూ సాధ్యమే : కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ ఆర్‌కే బీచ్‌ను కోత సమస్య వేధించేది. అక్కడి పోర్టు యాజమాన్యం డ్రెడ్జింగ్ కార్యకలాపాలు జరిపేటప్పుడు వెలికి తీసిన ఇసుకను సముద్రంలోనే వదిలేయకుండా ప్రత్యేక పైపులైను ద్వారా తీరానికి చేర్చడంతో బాగుపడింది. దీనికితోడు ప్రభుత్వం రక్షణగోడ నిర్మించడంతో పర్యాటకుల అసౌకర్యం తీరి సేదతీరేందుకు వెసులుబాటు దక్కింది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రొమినేడ్ బీచ్‌లో(Promenade Beach) కోత సమస్య తీవ్రంగా ఉండేది. గ్రోయన్ నిర్మాణంతో పాటు ఏటా 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీరంలో వేస్తూ కోతకు కట్టడి చేశారు.
అరేబియా సముద్ర తీరం : కేరళ రాష్ట్రంలో బ్యాక్ వాటర్ మధ్య ఉన్న అక్కడ ఉన్న చెల్లానం తీరాన్ని కోత ఉక్కిరిబిక్కిరి చేసేది. ఏటా వరదలూ పరిపాటి. సముద్ర కెరటాలు ఎత్తుగా ఎగసిపడే పరిస్థితి ఉన్న ఇక్కడ 320 కోట్లు రూపాయలు వెచ్చించి 6 కిలోమీటరు మేర రక్షణ గోడ నిర్మించారు. దీంతో 2 సంవత్సారులు అక్కడ కోత, ముంపు సమస్య జాడ లేదు.
తీరం కోత కట్టడికి ప్రణాళిక : మానవ తప్పిదాలు, వాతావరణంలో మార్పులతో 2010 నుంచి సముద్ర మట్టం పెరుగుతోందని చెన్నైలోని జాతీయ తీర ప్రాంత పరిశోధన కేంద్రం డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి పేర్కొన్నారు. తీర ప్రాంత పోర్టుల కార్యకలాపాల వల్ల కెరటాల ఉద్ధృతి ఓవైపు పెరగుతుందోని తెలిపారు. ఎగువన డ్యాములు కట్టడం వల్ల కిందికి వస్తున్న ఇసుక నిల్వలు తగ్గడం సమస్యకు కారణమని తెలియజేశారు. పోర్టుల్లో డ్రెడ్జింగ్ ద్వారా సేకరిస్తున్న ఇసుకను సమస్య ఉన్న తీరంలో వేస్తే బీచ్ ఏర్పాటై కోత తీవ్రత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల డిప్యూటీ సీఎం ఉప్పాడ తీరం కోత నివారణకు, రహదారి నిర్మాణానికి బృహత్తర ప్రణాళిక తయారుచేయమన్నారని తెలిపారు. సమస్యకు పరిష్కారం చూపుతూ నివేదిక అందించామని వ్యాఖ్యానించారు.
పిడుగురాళ్లలో డేంజర్‌బెల్స్ - విజృంభిస్తున్న డయేరియా - Diarrhea Spreds in Paldadu District