CM YS Jagan Election Campaign: పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రతో సామాన్యులకు అవస్థలు తప్పలేదు. బస్సు యాత్ర కొనసాగే మార్గం పొడవునా సోమవారం నుంచే విద్యుత్ తీగలను తొలగించారు. గణపవరం మండలంలో ఉదయం విద్యుత్ తీగలు కత్తిరించి సరఫరా నిలిపివేశారు. అసలే ఎండాకాలం కావడం, ఆపై ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు.
గతంలో ఎంతోమంది సీఎంలు, ప్రముఖులు వచ్చినా ఇలా ఎప్పుడూ విద్యుత్ సరఫరా నిలిపివేయలేదని ప్రజలు మండిపడ్డారు. యాత్ర ప్రారంభం కాకముందు నుంచే దుకాణాలు మూసివేయించడంతో దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వస్తే ఇలా అవస్థలు పడేల్సిందేనా అంటూ మండిపడుతున్నారు.
మేమంతా సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులను తరలించడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు అన్ని డిపోల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక ఉక్కపోతతో నరకం చూశారు. భీమవరం, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిన పలు బస్సులను సైతం నిలిపివేయడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎండవేడిమి, ఉక్కపోత తాళలేక చెమటలు కార్చుకుంటూ ఆపసోపాలు పడ్డారు.
మధ్యాహ్నం జగనన్న రాక - ఉదయమే నుంచే పవర్ కట్ - CM Jagan bus yatra
బస్సు యాత్ర మార్గంలో కిలోమీటర్ల పొడవునా విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. బ్యాంకులు మొదలు పెట్రోల్ బంకుల వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలలోనూ విద్యుత్ సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు ఆరుబయటే సెలైన్ ఎక్కించారు. భీమవరంలో సీఎం బస్సు యాత్ర జరిగే ప్రధాన మార్గంలో రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద చెట్లను వేళ్లతో సహా తీసేశారు. అదేవిధంగా విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లను సైతం తొలగించేశారు. అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచి ప్రజలు ఇ్బబందులు పడ్డారు.
భీమవరంలో సీఎం బస్సు యాత్ర - రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగింపు - CM Jagan Tour Trees Cuts
సీఎం జగన్ వస్తున్నారంటే వాహనదారులకు ట్రాఫిక్ ఆంక్షలతో తిప్పలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి జగన్ సభ ఎక్కడ ఉంటే అక్కడికి బస్సులను తరలించడంతో ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందరో ముఖ్యమంత్రులు పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసినప్పటకీ ఇంతటి విధ్వంసం ఎవరూ చేయలేదని ప్రజలు మండిపడుతున్నారు.
"ఉదయం మూడున్నర నుంచే విద్యుత్‌ను నిలిపివేశారు. ఎందుకు అని అడిగితే జగన్ వస్తున్నారని వైర్లు కట్ చేశారు. విద్యుత్ లేకపోవడంతో వాటర్ లేదు. విద్యుత్ లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో అనేక మంది నేతలు ప్రచారానికి వచ్చినా, ఇంతలా ఇబ్బందులకు గురికాలేదు. సీఎం పర్యటన కోసం రోడ్డుపై ఉన్న చెట్లను సైతం కొట్టారు. విద్యుత్ తీగలు సీఎం బస్సుకు అడ్డంగా వస్తున్నాయని విద్యుత్ నిలిపివేశారు. ఉదయం నుంచి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు". - ప్రజలు