CM Jagan Stone Incident Updates: ప్రజాస్వామ్యంలో హింసకు తావుండకూడదు. అది చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కీలకమైన పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో స్పందించాలి. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాళ్లదాడులు జరిగితే మంత్రులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో చెప్పడానికి వారి వ్యాఖ్యలే అద్దంపడతాయనడంతో ఎలాంటి సందేహం లేదు.
మంత్రులు, డీజీపీ హోదాలో గౌతమ్ సవాంగ్, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ తానేటి వనిత కూడా ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయనపై వైసీపీ ప్రేరేపిత అల్లరి మూకలు దాడులకు దిగినప్పుడు వైసీపీ నాయకులు, మాజీ డీజీపీ బాధ్యతారహితంగా మాట్లాడారు. హింసాకాండను నివారించాల్సిన, దాడులకు దిగినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోయి, వైసీపీ కార్యకర్తలా ఇష్టానుసారం మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే అది భావప్రకటన స్వేచ్ఛని, నిరసన తెలిపే హక్కని, సానుభూతి కోసం వారి మనుషులతోనే దాడి చేయించుకున్నారని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు వారి నాయకుడు, సీఎం జగన్‌పై దాడి జరిగితే శివాలెత్తిపోతున్నారు. ప్రొటోకాల్ పరంగా రాష్ట్రంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ముఖ్యమంత్రిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడం ఘోర భద్రతా వైఫల్యానికి నిదర్శనం. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని వైసీపీ నేతలు సీఎంపై దాడికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు.
సీఎంపై ఎప్పుడు దాడి జరుగుతుందా, ఎప్పుడు విపక్ష నేతలపై విరుచుకుపడదామా అని కాచుకుని కూర్చున్నట్టుగా ఇలా ఆ ఘటన జరిగిందో లేదో మరుక్షణం ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. గులకరాయితో కొడితే ప్రాణాలు పోతాయా అన్నవారే ఇప్పుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగిందని, దానికి విపక్ష నాయకులే కారణమని ఆరోపణలు చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫొటోలను చెప్పులతో కొట్టారు. ఫ్లెక్సీలు తగలబెట్టారు. రాస్తారోకోలు చేశారు. అంతా ముందే సిద్ధం చేసుకున్నట్టుగా సీఎంపై దాడి జరిగిన కొద్దిసేపటికే ఇవన్నీ జరిగిపోయాయి. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అది భావప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేయడమా? అదే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అది హత్యాయత్నమా? మంత్రులకు, వైసీపీ నాయకులకు వారేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం జగన్‌పై దాడి ఘటనపై కేసు నమోదు - టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో విచారణ - attack on ap cm ys jagan
ముఖ్యమంత్రి అంటేనే వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆయన ఏ సభలో పాల్గొన్నా ఎవరైనా ఎటునుంచైనా దాడి చేస్తారేమోనని భద్రతా అధికారులు డేగకళ్లతో పర్యవేక్షిస్తుంటారు. జగన్ భద్రత గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన రోడ్డుపైకి వస్తున్నారంటేనే పరదాలు కట్టేస్తారు, బారికేడ్లు పెట్టేస్తారు, చివరకు పచ్చటి చెట్లూ కొట్టేస్తారు. అలాంటిది శనివారం రాత్రి ఆయనపై జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా వైసీపీ నాయకులెవరూ దాని గురించి మాట్లాడలేదు.
సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సింది పోయి విపక్షాలపై ఆరోపణలు చేయడమేంటనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో జగన్ పర్యటిస్తున్న సమయంలో ప్రతి సెంటర్‌లో కరెంటు ఎందుకు తీసేశారు? సీఎంకి రాయి తగిలిందని చెబుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఎందుకు కూర్చుని ఉన్నారు? ఆ సమయంలో సాక్షి ఛానల్‌లో లైవ్ ఎందుకు ఇవ్వలేదు? అది ప్రధాన కూడలి కానప్పుడు, అక్కడ పెద్దగా జనం లేనప్పుడు జగన్ బస్సుపైకి ఎందుకు ఎక్కారు?.
ప్రొటోకాల్ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండే సీఎంపైకి రాయి విసిరారంటే దుండగుడు అక్కడకు సమీపంలోనే ఉంటాడు. వందల సంఖ్యలో ఉండే భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఆ దుండగుడిని గుర్తించి ఎందుకు పట్టుకోలేదు? రాయి విసిరిన వారెవరో ఇప్పటికీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలెన్నో ప్రజల నుంచి వస్తున్నాయి.