CM Jagan on Visakha Vision Developmental Projects: ఎన్నికలకు ముందు జగన్ మరో నాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చి అమరావతి అంతు చూసిన జగన్ త్వరలోనే విశాఖకు వచ్చేస్తున్నానని పలుమార్లు ఘనంగా ప్రకటించుకున్నారు. ఆయనతో పాటు మంత్రులు, వైసీపీ ముఖ్యనేతలు సైతం సీఎం వచ్చేస్తున్నారని ప్రచారం చేశారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో ఇప్పుడు సరికొత్త రాగం అందుకున్నారు. ఎన్నికలయ్యాక విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తారట. భవనాలు కట్టి అక్కడే ఉంటానంటూ బడాయి మాటలు చెప్పారు.
గత ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా మాట్లాడిన జగన్ అధికారంలో ఉన్న చంద్రబాబు రాజధాని కట్టలేదన్నారు. తాను అధికారంలోకి రాగానే అందరూ గర్వించేలా రాజధాని కడతామని, పైగా అమరావతిలోనే తాను సొంతిల్లు కట్టుకున్నానని కూడా చెప్పారు. మరి జగన్ సీఎం అయ్యాక పరిస్థితి ఏంటి?చేతిలోకి పవర్ వచ్చేసరికి జగన్ మాట మారిపోయింది. నాలుక మడతేశారు. అబ్బెబ్బే అమరావతిని నిర్మించలేము. అంత డబ్బు మా దగ్గర లేదంటూ తన మార్క్ విశ్వసనీయతను బయటపెట్టారు.
అమరావతిలో గత ప్రభుత్వం తలపెట్టి దాదాపు పూర్తి కావొచ్చిన భవనాలన్నీ నాలుగున్నరేళ్లుగా మూలన పడ్డాయి. వాటిని అలా పాడుబెట్టిన జగన్ 3 రాజధానులంటూ కొత్త సూత్రం చెప్పారు. అదీ కాదంటూ చివరికి విశాఖలోనే మకాం అన్నారు. ఇదిగో విశాఖకు వస్తున్నా. అదిగో విశాఖకు వచ్చేస్తున్నా. సంక్రాంతి, దసరా, తర్వాత డిసెంబర్ అంటూ ఊదరగొట్టారు. ఇలా విశాఖ వచ్చేస్తున్నానంటూ చెప్పిన జగన్ ఇప్పుడు మరో పల్లవి అందుకున్నారు.
ఎన్నికల తర్వాత విశాఖపట్నంలోనే ఉంటానని, ప్రమాణస్వీకారమూ ఇక్కడేనని జగన్ మరో మోసానికి తెరతీశారు. ప్రపంచాన్ని ఆకర్షించే ఐకానిక్ సచివాలయం, కన్వెన్షన్ సెంటర్, స్టేడియం నిర్మిస్తానని ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తుత్తి మాటలు చెప్పారు. గత ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతంలో ఇదే మాట చెప్పారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, రాజధానిని గొప్పగా కడతామని ప్రకటించారు. కానీ అధికారంలోకి రాగానే అమరావతిని నాశనం చేశారు.
బీసీల దశ, దిశ మార్చడం కోసమే 'బీసీ డిక్లరేషన్': చంద్రబాబు
నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుందని విషం కక్కారు. విశాఖలోనైతే ఇప్పటికే అవసరమైన అన్ని హంగులూ ఉన్నాయని, దాన్నే రాజధానిగా చేస్తే సరిపోతుందని సెలవిచ్చారు. విశాఖలో ఐకానిక్ సచివాలయం, కన్వెన్షన్ సెంటర్, స్టేడియం నిర్మిస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఒక్క భవనమైనా నిర్మించారా? రుషికొండపై రాజభవనాలు తప్ప. వాస్తవానికి విశాఖపట్నంలో భూములు, వనరుల దోపిడీ తప్పితే జగన్ చేసిందేమీ లేదు.
ప్రశాంత నగరాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చారు. పేరున్న ఐటీ సంస్థల్ని తరిమేశారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థ 'లులూ' ను గెంటేశారు. భోగాపురం విమానాశ్రయ పనుల్నీ సొంత ప్రయోజనాల కోసం ముందుకు కదలనీయలేదు. ఇప్పటికల్లా నిర్మాణం పూర్తయి, విమానాల రాకపోకలు మొదలు కావాల్సి ఉండగా నిర్మాణాలు ప్రారంభదశలోనే ఉన్నాయి.
ఎన్నికల సమయంలో వీటన్నింటిపై ఉత్తరాంధ్రా వాసులు ఎక్కడ ప్రశ్నిస్తారోనని భావించిన సీఎం విశాఖ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళికను సిద్ధం చేశామని, ఐకానిక్ భవనాలను నిర్మిస్తామంటూ మంగళవారం నిర్వహించిన 'విశాఖ విజన్' సమావేశంలో ఊదరగొట్టారు. అవకాశమిస్తే మరో పదేళ్లు విశాఖను ఊడ్చేయడానికి సిద్ధం అని చెప్పకనే చెప్పారు.
ఎన్నికల తర్వాత విశాఖలోనే - సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం: జగన్