CM Jagan Negligence on Jalayagnam Project : "పోలవరం సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వంశధార, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత తాగు, సాగునీటి కలలను నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం. రాష్ట్రానికి జలకళ తీసుకొస్తాం" అంటూ 2019 జనవరి 10న ఇచ్ఛాపురంలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ ప్రకటించారు. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరిట జగన్ ఇచ్చిన హామీల్లో జలయజ్ఞం (Jalayagnam) ముఖ్యమైంది. జలయజ్ఞం అంటే కేవలం ఏదో ఒక్క ప్రాజెక్టు కాదు. పోలవరంతో సహా గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ తదితర అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. నమ్మిన ఓటర్లు గెలిపించారు. ఆయన అధికారంలోకి వచ్చే సరికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలంటే అప్పటి అంచనాల ప్రకారం కావాల్సిన మొత్తం రూ.74,183 కోట్లు. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక తనంతట తానుగా కొత్తగా చేపడతామన్న ప్రాజెక్టుల అంచనా విలువ రూ.90,632 కోట్లు. జగన్ సర్కారు లెక్కల ప్రకారం అన్నింటికీ కలిపి మొత్తం కావాల్సిన నిధులు రూ.1,64,815 కోట్లు.
ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టును పట్టించుకోలేదు : ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన జగన్ సర్కారు జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయామని శాసనసభ సాక్షిగా చేతులెత్తేసింది. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పదేపదే చెప్పారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను 2024 తర్వాతే పూర్తి చేయగలమని అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా సర్కారు సమాధానం ఇచ్చింది. అంటే తాము అధికారం చెలాయించిన ఐదేళ్లలో జలయజ్ఞం ప్రాజెక్టు(Jalayagnam Project)లను పట్టించుకోలేదని సర్కారే ప్రకటించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఎన్నికల ముంగిట్లో సీఎం జగన్ ( CM Jagan) అబద్ధాలు వల్లెవేస్తున్నారు. ప్రతి సభలోనూ జలయజ్ఞంపై ప్రజల ముందు ఏమాత్రం జంకూ లేకుండా పదేపదే పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.
జలయజ్ఞం పూర్తికి సంకల్పం.. 38,023 కోట్లు అవసరం
- ప్రజలు ఎంతగానో నమ్మి జగన్‌కు 151 సీట్లు అప్పగిస్తే సాగునీటి ప్రాజెక్టులన్నింటీనీ మూలన పడేశారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది.
- వెలిగొండ రెండో టన్నెల్‌ను మాత్రమే పూర్తిచేసి ఏకంగా ప్రాజెక్టే పూర్తయిందన్నంతగా సీఎం జగన్ హడావుడి చేశారు.
- ఆ టన్నెల్ నిర్మాణంతో ఆయకట్టు సాగులోకి రాదు. వెలిగొండ కింద కనీసం తొలిదశ ఆయకట్టు సాగులోకి రావాలన్నా మరో రెండేళ్ల సమయం పడుతుందని జలవనరులశాఖ అధికారులే
- చెబుతున్నారు.
- 2019 నాటికే 70% పూర్తయిన నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాలను అతికష్టం మీద పూర్తి చేశారు.
- అవుకు టన్నెల్ ఒకటి పూర్తి చేశారు. ఇప్పటికే గండికోటలో ఉన్న నీటిని ఆయకట్టుకు ఇచ్చే దిక్కులేదు. కొత్తగా అవుకు ద్వారా మరింత నీరు పంపి సాధించేదీ ఏమీ లేదు.
- నిధులను తక్షణ అవసరమైన ప్రాజెక్టులపై వెచ్చించలేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) నిర్మాణాలు ఆపాలని ఆదేశించిన ప్రాజెక్టులకు, ఇప్పట్లో నీళ్లు అందుబాటులోకి రాని ఎత్తిపోతల పథకాలకు రూ.వేల కోట్ల బిల్లులను చెల్లించేసి నిధుల దుర్వినియోగం చేశారు.
ప్రతిపక్షనేత హోదాలో జగన్ : ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలన్నా, భవిష్యత్తులో అవి భారంగా మారకుండా ఉండాలన్నా చాలినన్ని నిధులు ఇవ్వాలి. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు కేటాయిస్తే ఎప్పటికి పూర్తవుతుందనే అంచనా ఉన్నా అందుకు తగ్గట్టుగా బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆ అరకొర కేటాయింపుల్లో సగమైనా ఖర్చు చేసిన దాఖలాలూ లేవు. మొత్తం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధుల్లో 20% మాత్రమే ఖర్చు చేసింది. ఆయన పూర్తి చేస్తానన్న 26 సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.61,573 కోట్లు ఇస్తామంటూ బడ్జెట్‌లో ప్రతిపాదించి చేసిన ఖర్చు రూ.35,268 కోట్లు మాత్రమే. ఇందులో ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణకు పనులు కలిపే ఉండటం గమనార్హం. అంటే నికరంగా ప్రాజెక్టులపై వ్యయం చేసిన మొత్తం మరింత తగ్గిపోతుంది. ప్రతిపక్షనేత హోదాలో జగన్ ఏ ఊరు వెళ్లినా ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేస్తానని ఘనంగా చెప్పిన ఆయన ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?
పోలవరం ప్రొజెక్టు తొలి దశ నిర్మాణం పూర్తికి మరోసారి గడువు పెట్టిన కేంద్రం
సాగుతున్న పనులకు బ్రేక్ : పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యమైంది. వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక వేగంగా సాగుతున్న పనులకు బ్రేక్ పడింది. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణాన్ని ఆలస్యం చేసింది. ఫలితంగా వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఎగువ కాఫర్ డ్యాం (Coffer Dam) గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడంతోనే పోలవరం సంక్షోభంలో చిక్కుకుందని కేంద్రమూ తేల్చింది. పోలవరం గుత్తేదారులను మార్చితే సంక్షోభంలోకి వెళ్లిపోవచ్చని కేంద్ర జల్‌శక్తి శాఖ హెచ్చరించినట్లే జరిగింది.
- వంశధార రెండో భాగం రెండో దశ పనులకు కూడా నాలుగేళ్లలో కేవలం రూ.400 కోట్లే ఖర్చు చేశారు. మరో రూ.500 కోట్లు వెచ్చిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదు.
- వెలిగొండ తమకెంతో ముఖ్యమైందని, 2024 చివరికి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మరో రూ.4,000 కోట్లు ఉంటే తప్ప దీన్ని పూర్తి చేయలేమని అధికారులు అంచనాలు రూపొందించారు. మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.101.47 కోట్లు మాత్రమే కేటాయించారు. ఖర్చు చేసింది రూ.26 కోట్లు మాత్రమే.
- వంశధార, నాగావళి అనుసంధానాన్ని వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు.
- నిధుల కొరత కారణంగా తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల, హంద్రీనీవా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీలు, గాలేరు-నగరి రెండో దశ, డిస్ట్రిబ్యూటరీలు ఇలా చెబుతూ పోతే ఏ ప్రాజెక్టూ పూర్తి కాలేదు.
భవిష్యత్తులో ఎంత భారం! : జగన్ సర్కారులో సాగునీటి రంగానికి వాటిల్లిన నష్టం నుంచి కోలుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు ధరలు పెరిగిపోతుంటాయి. కట్టడాలను ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మేలు జరుగుతుంది. అలాంటిది ఈ ఐదేళ్ల శాపం కారణంగా ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం అంతకంతకూ పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో తన సొంత మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎంపీల కంపెనీలకు పనులు అప్పగించేందుకు వీలుగా పాత కాంట్రాక్టులను రద్దు చేసి, అనేక ప్రాజెక్టుల్లో అంచనాలను పెంచేశారు. తన వారికి ఆయా పనులను అప్పగించేశారు. ఎక్కడైతే తన మనుషులు గుత్తేదారులుగా ఉన్నారో అక్కడే నిధులను విడుదల చేశారు. ఇతరచోట్ల నిధులు కేటాయించక, చేసిన పనులకు బిల్లులూ ఇవ్వకపోవడంతో గుత్తేదారులు గుండె గుబిల్లుమంది. దాంతో వారంతా తమ యంత్రాలను, మానవ వనరులను ఇతర రాష్ట్రాలకు తరలించేశారు.
జగన్ సర్కార్ నిర్లక్ష్యం - భారీగా పెరిగిన పోలవరం నిర్మాణ అంచనాలు