CM Jagan Neglect Tenant Farmers : సీఎం జగన్ అధికారంలోకి వచ్చిది మొదలు కౌలు రైతుకు అన్నీ కష్టాలే. రాయితీ పథకాలు లేవు. పెట్టుబడి సాయం అందలేదు. గతప్రభుత్వ హయాంలో (2019 వరకు) భూమి యజమాని పట్టా పుస్తకం నకలు చూపించి వేలిముద్ర వేస్తే కౌలు రైతుకు రాయితీ విత్తనాలు ఇచ్చేవారు. జగన్ సర్కారు వచ్చాక అది తీసేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏడాదికి రూ.4 వేల కోట్లకు పైగా పంట రుణాలు ఇప్పించేవారు. జగన్ సర్కారు అందులో సగమైనా ఇవ్వలేదు. రైతు భరోసా రూపంలోనే రూ.9,639 కోట్లు ఎగ్గొట్టారు.
వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి వస్తే వరదలు లేదంటే కరవు. కూలీనాలీ చేసుకుని సంపాదించుకున్న సొమ్ముతో పాటు అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే తిరిగి పైసా చేతికి దక్కక అల్లాడిన వారు లక్షల్లో ఉన్నారు. కౌలు రైతులు అధికంగా ఉండే ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జగన్ సర్కారు అస్తవ్యస్త విధానాలతో కౌలు రైతుల్లో సగటున 5% మందికైనా ప్రభుత్వ పథకాలు అందలేదు. ఆత్మహత్య చేసుకున్న కౌలు కుటుంబాలకు సాయం అందించడంలో మోకాలొడ్డిన ఘనత జగన్‌కే దక్కుతుంది.
రాజధానుల పేరిట జగన్ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours
గుర్తింపే లేదు, కార్డులిచ్చేందుకూ కొర్రీలు : కౌలు రైతులకు 11 నెలల కాలానికి పంట సాగుదారు హక్కు (CCRC) కార్డులు ఇచ్చి ప్రభుత్వ ప్రయోజనాలన్నీ వర్తింపజేస్తామంటూ 2019లో జగన్ సర్కారు ప్రత్యేక చట్టం తెచ్చినా ఒనగూరిందేమీ లేదు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వడానికి అనేక కొర్రీలు పెట్టింది. దశాబ్దం కిందటి లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. ఇందులో కౌలు గుర్తింపు కార్డులు అందుకునే వారు సగటున సంవత్సరానికి 5 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అందులోనూ ఎకరమో, అర ఎకరమో భూమి ఉన్న వారే అధికం. సొంత భూమిపై దక్కే ప్రయోజనాలనే కౌలు గుర్తింపు కార్డులు ఉన్న రైతన్నలకు ఇచ్చినట్లు చూపిస్తున్నారు.
కౌలు గుర్తింపు కార్డులు అందకపోవడంతో లక్షల మంది కౌలు రైతులకు రాయితీ విత్తనాలను, పంట రుణాలను ఇవ్వలేదు. సున్నా వడ్డీని దూరం చేశారు. రైతు భరోసాకు మొండిచేయి చూపారు. పంట నష్టపోతే పెట్టుబడి సాయం అందివ్వలేదు. పంటల బీమాను వర్తింప చేయలేదు. నానా కష్టాలు పడి సాధించిన దిగుబడులను అమ్ముకోవడానికి వస్తే కౌలు కార్డు లేదంటూ తిరస్కరిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారమూ ఇవ్వడం లేదు.
పెట్టుబడి సాయానికీ అర్హులు కారట : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వరదలు లేదంటే కరవు వేధిస్తున్నాయి. దీనికి పెట్టుబడి సాయంగా సగటున ఎకరానికి 4 వేల రూపాయలు నుంచి 5 వేలు రూపాయలు ఇస్తున్నారు. ఈ కొద్దిపాటి మొత్తానికి కూడా కౌలు రైతులు అర్హులు కాలేకపోతున్నారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం రైతుకు ఇచ్చిన మొత్తం పెట్టుబడి రాయితీ 3,261 కోట్లు రూపాయలు. ఇందులో కౌలు రైతులకు దక్కింది 253 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది 7.75 శాతం మాత్రమే కావడం గమనార్హం.
నిరుపేదలు, కూలీలే అధికం : కౌలుదారుల్లో 95 శాతం పైగా నిరుపేద కూలీలే. వ్యవసాయ పనులు చేస్తూ సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. పొలమును కౌలుకు తీసుకొని సాగు చేస్తే తమ పిల్లల చదువులకైనా ఉపయోగపడతాయని ఆశ పడుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వారికి అప్పులే మిగులుతున్నాయి. వాటిని తీర్చడానికి మళ్లీ మళ్లీ కౌలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలాంటి వారిని ఉదారంగా ఆదుకోవాలనే ఆలోచన కూడా జగన్ సర్కారుకు లేకపోయింది.
అయిదేళ్లలో రూ.9,639 కోట్ల ఎగవేత : సీఎం జగన్ ప్రసంగం మొదలు పెడితే చాలు తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటూ అబద్ధాలను వల్లె వేయడంలో దిట్ట. రాష్ట్రంలో 15.36 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో (2019) జగన్ లేఖలు రాశారు. జగన్ మాటల ప్రకారమే ప్రతి రైతు కుటుంబానికి 13,500 రూపాయల చొప్పున ఏడాదికి 2,073 కోట్లు రూపాయలు, ఐదేళ్లకు 10,365 కోట్లు రూపాయలు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో 24 లక్షల మంది కౌలు రైతులుంటే ఏడాదికి సగటున 1,07,627 మందికి చొప్పున ఐదేళ్లలో రూ. 726 కోట్లు మాత్రమే ఇచ్చారు.
రైతుబిడ్డనని చెప్పే జగన్ కౌలు రైతులకు 9,639 కోట్లు రూపాయలు ఎగ్గొట్టారు. ఆర్‌బీకేలకు వెళ్తే అక్కడ సీసీఆర్‌సీ (CCRC) కార్డు ఇస్తారన్న జగన్ హామీ నీటి మీద రాతే అయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలోను కొంత మంది కౌలు రైతులకే రైతు భరోసా వర్తింపజేశారు. సంవత్సరానికి 80 వేల మంది అటవీ భూముల హక్కుదారులకు 108 కోట్ల రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తున్నారు. అది వాస్తవ సాగుదారులకు దక్కడం లేదు. అధిక శాతం మందికి మొండి చేయి చూపిస్తున్నారు.
ఉత్తరాంధ్రపై మాటల్లోనే జగన్ ప్రేమ - అభివృద్ధిలో ఉత్త చేయే
ఉచిత బీమా హుళక్కే? : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పంటల బీమాను అంతుచిక్కని రహస్యంగా మార్చేశారు. నిబంధనలేమిటో, నిపుణులెవరో, ఎవరికిస్తున్నారో చెప్పే వారే ఉండరు. కౌలు రైతుల విషయంలో మరింత మోసం చేశారు. నాలుగేళ్లలో పంటల బీమా పరిహారంగా మొత్తం 7,087 కోట్లు రూపాయలు చెల్లిస్తే అందులో 3,54,378 మంది కౌలు రైతులకు దక్కింది 731 కోట్లే రూపాయలు కావడం గమనార్హం. రాష్ట్రంలో సాగు చేస్తున్న మొత్తం భూ విస్తీర్ణంలో పండిస్తున్న కౌలు రైతులకు బీమా పరిహారంలో 10% మాత్రమే వాటా ఇస్తున్నారు. ఈ పథకం వర్తించే వారి సంఖ్య ఏడాదికి సరాసరి 88 వేల మందే.
పంట రుణాల్లేవు, వడ్డీ రాయితీకి సున్నా : ఏపీలో సంవత్సరానికి 1.48 లక్షల కోట్ల రూపాయలు పంట రుణాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 50 శాతం విస్తీర్ణంలో కౌలు రైతులు పంటలు వేస్తున్నారు అనుకున్నా 74 వేల కోట్ల రూపాయలు రుణాలు వారికే దక్కాలి. వాస్తవానికి ఇలా జరగడం లేదు. దీంతో అధిక వడ్డీలకు ప్రైవేటుగా అప్పులు తెచ్చుకుని, కౌలు రైతులంతా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. 2019-20 సంవత్సరంలో 2,304 కోట్లు రూపాయలు ఇవ్వగా, తర్వాత ఏడాది 1,000 కోట్ల రూపాయలకే పరిమితం చేశారు. 2021-22లో 1,744 కోట్లు రూపాయలు, 2022-23లో 1,566 కోట్లు రూపాయలు, 2023-24 సంవత్సరంలో రూ.1,675 కోట్ల రుణాలే కౌలు రైతులకు దక్కాయి. సున్నా వడ్డీ మాటే అసలు లేదు.