CM Jagan Not Encouraging BC Entrepreneurs : బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని ప్రగల్భాలు పలికే సీఎం జగన్ ఏపీలోని బీసీలకు అన్యాయం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన 2020-23, 2023-27 పారిశ్రామిక విధానాలే ఇందుకు నిదర్శనం. బీసీ పారిశ్రామికవేత్తలు భూములు కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలను జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు.
రాయితీలు పూర్తిగా తొలగింపు : గత తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలతో సమానంగా బీసీలకూ ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ-2015ని అమలు చేసింది. పరిశ్రమల ఏర్పాటు నిమిత్తం పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్లలో కొనుగోలు చేసే భూములకు ఏపీఐఐసీ నిర్దేశించిన ధరలో 50 శాతాన్ని చెల్లిస్తే సరిపోయేది. మహిళా పారిశ్రామికవేత్తలకు మరో 10 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది గత తెలుగుదేశం ప్రభుత్వం. స్థిర మూలధన పెట్టుబడిలో 35 శాతం రిబేటు ఇచ్చింది. చిన్న పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఊరట కల్పించింది కూడా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం తాను మొదటిసారి ప్రవేశపెట్టిన 2020-23 పారిశ్రామిక విధానంలో రాయితీలను పూర్తిగా తొలగించింది. దీనివల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఆసక్తి ఉన్న బీసీలు ఇతరుల మాదిరే మార్కెట్ ధరలకు భూములను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీ పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించడం, నిర్వహించడం బీసీలకు సాధ్యమేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాష్ట్రంలోని బీసీలకు వైసీపీ ఏం చెప్పింది ? ఏం చేస్తోంది ?
జగన్ సర్కార్ విరుద్ధం : వెనకబడిన వర్గాలను పారిశ్రామికరంగం వైపు మళ్లించి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చుతామని, ప్రోత్సాహకాలు అందిస్తామని కోతలు కోశారు. తీరాచూస్తే వారికి ఇచ్చే రాయితీల్లో అడ్డగోలుగా కోత కోశారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2015-20 పారిశ్రామిక విధానంలో వారికి ఎంతో వెసులుబాటును ఇచ్చింది. భూముల కొనుగోలుకు చేసే ఖర్చులో 50 శాతం రాయితీని కల్పించింది. గరిష్ఠంగా 20 లక్షల రాయితీ పొందే అవకాశముండేది. అంతకు మించితే లబ్ధిదారుడే చెల్లించాలి. పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో భూములను తక్కువ ధరకే అందించింది. జగన్ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
ధరలను విపరీతంగా పెంచేసిన ప్రభుత్వం : మొదటిసారి ప్రవేశపెట్టిన 2020-23 పారిశ్రామిక విధానంలో ప్రత్యేక ప్యాకేజీ కింద అందించే రాయితీని పూర్తిగా తొలగించింది. దీంతో భూముల కొనుగోళ్లలో 20 లక్షల రాయితీని పొందే అవకాశాన్ని వారికి లేకుండా చేసింది. దీనికితోడు పరిశ్రమలకు కేటాయించే భూముల ధరలను భారీగా పెంచింది. పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఎకరాకు 8 లక్షలుగా నిర్ణయించింది. ఈ ప్రభుత్వం మాత్రం హద్దూఅదుపు లేకుండా భూముల ధరలను విపరీతంగా పెంచేసింది. ఫలితంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉవ్విళ్లూరే బీసీలు భూముల కొనుగోలుకే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి యూనిట్ నిర్మాణం, ఇతర నిర్వహణ మూలధనం అదనం. ఈ పరిస్థితుల్లో వెనకబడిన వర్గాలవారు పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదుగుతారో జగన్‌కే తెలియాలి.
YCP Neglecting SC ST BC Communities: నా ఎస్సీ, ఎస్టీలు.. నా బీసీలంటూ గొప్పలు.. చేతల్లో మొండిచేయి