CM Jagan Inaugurated Second Tunnel of Veligonda Project: ప్రకాశం జిల్లాలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. 30 మండలాలకు సాగు, తాగునీటిని అందించడంతోపాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు కూడా ఎంతో కీలకమైన ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయన కొడుకుగా తాను పూర్తి చేసి ప్రారంభించడం దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే పూర్తయిందని జగన్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందిస్తామని తెలిపారు.
విశాఖలోనే ప్రమాణస్వీకారం- అవకాశమిస్తే మరో పదేళ్లు ఊడ్చేయడానికి సిద్ధం: చెప్పకనే చెప్పిన సీఎం
ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్న, దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముందని జగన్ కొనియాడారు. దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశామని ఇప్పుడు 8,500 క్యూసెక్కుల కేరీయింగ్ కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయిందని అన్నారు. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకొస్తామని తెలిపారు.
జగన్ విశాఖ పర్యటన - ఐటీ ఉద్యోగులు, సామాన్యులకు తప్పని తిప్పలు
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి జూలై – ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో రూ.1200 కోట్లు ఖర్చు చేసి ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్ పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టమైన ఈ రెండు టన్నెళ్లు పూర్తయ్యాయని అన్నారు. నీళ్లు నింపడం కోసం రూ.1200 కోట్లు ఎల్‌ఏ, ఆర్ అండ్ ఆర్ కింద ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుందని అన్నారు. 2014 నుంచి 2019 వరకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చూస్తే కేవలం 6.6 కి.మీ మాత్రమే టన్నెళ్ల పనులు జరిగాయని విమర్శించారు. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే మిగిలిపోయిన 11 కిలోమీటర్ల టన్నెళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామని అన్నారు.
బంగాళాఖాతం పక్కనే జగనన్న బడాయి మాటలు - సంక్రాంతికి పక్కా - దసరాకి వచ్చేస్తా - మరో'సారీ'
ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి, మీకు కృతజ్ఞతలని జగన్ అన్నారు. ఇంత మంచి చేస్తూ మీ ముఖాల్లో చిరునవ్వులు చూసే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా వచ్చిందన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖమంత్రి అంబటి రాంబాబు, మంత్రులు మేరుగు నాగార్జున, సురేష్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస రెడ్డి, అన్నా రాంబాబు, నాగార్జున, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎర్రగొండపాలెం అభ్యర్థి తాడిపర్తి చంద్ర శేఖర్ పాల్గొన్నారు.