CM Jagan Forgotten Promises Given to Konaseema People: సీఎం జగన్ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజలతో చప్పట్లు కొట్టించుకోడానికి నోటికొచ్చిన హమీలు ఇచ్చేస్తారు. ఆ ప్రాంతం దాటి పక్కకెళ్లగానే హామీలన్నింటినీ గాలికొదిలేస్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇదే పునరావృతమవుతోంది. కోనసీమ జిల్లాలోనూ అనేక సార్లు పర్యటించిన సీఎం జగన్ ఎన్నెన్నో హామీలిచ్చి వాటిని గోదావరి వరదల్లో ముంచేశారు. నేడు బస్సుయాత్ర పేరిట జిల్లాలో పర్యటిస్తున్న జగన్ హామీల అమలుపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించాడు - గద్దెనెక్కి నిరుద్యోగులను నిండా ముంచాడు - Youth Fire on YSRCP Govt
వైసీపీ ఐదేళ్ల పాలనలో కోనసీమ జిల్లాకు జగన్ వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా గ్రామాలను అనుసంధానించే కాజ్‌వే మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. ప్రజల ఇక్కట్లు తీర్చలేదు. భూములు కోతకు గురికాకుండా రక్షణ గోడలు నిర్మించలేదు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదు. పరిస్థితులకు తగ్గట్లు మాటలు చెప్పి ఇక్కడి ప్రజలను నిండా ముంచేశారు. ఎన్నికల నేపథ్యంలో బస్సుయాత్ర చేపడుతూ నేడు జిల్లాకు రానున్న జగన్ హామీలపై సమాధానం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హామీలు భేష్, అమలు తుస్ - ఊకదంపుడు ఉపన్యాసాలతో ఐదేళ్లు పబ్బం గడిపిన జగన్ - CM Jagan Assurances
2019 నవంబర్ 21న జాతీయ మత్స్యకార దినోత్సవం సభకు వచ్చిన సీఎం జగన్ ఐ.పోలవరం మండలం ఎదుర్లంకలో నది కోతకు గురవుతున్న లంక భూముల రక్షణకు శిలాఫలకం ఆవిష్కరించారు. రూ. 79.76 కోట్లతో పిచ్చింగ్, రివిట్‌మెంట్ పనులు చేస్తామని హామీ ఇచ్చారు. నాలుగు సంవత్సరాలు గడిచినా పనులు మొదలుపెట్టలేదు. తీరా ఎన్నికలు సమీపించగానే రెండు నెలల క్రితం హడావుడిగా రాళ్లు తెచ్చి గట్టు మీద వేశారు. ఈ వ్యవధిలో పనులు చేపట్టకపోవడం వల్ల 200 ఎకరాల కొబ్బరితోటలు కనుమరుగయ్యాయని రైతులు వాపోతున్నారు.
2021 ఆగస్టు 16న నాడు-నేడు రెండో దశ పనులు ప్రారంభించినప్పుడు సీఎం జగన్ ఇచ్చిన హామీలివి. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. అయినవిల్లి మండలం వెదురుబిడెంలో రూ. 40 కోట్ల రూపాయలతో ఎత్తైన కాజ్‌వే నిర్మిస్తామన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడల్లా వెదురుబిడెం కాజ్‌వే మునుగుతుంది. దీంతో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, అద్దంకివారిలంక గ్రామాల్లోని 15 వేల మందికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి.
కొంగుచాచిన తోబుట్టువులకు ఏం చెప్తావ్ జగన్? - Sisters fire on CM Jagan
కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో నిర్వహించిన మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ చెప్పిన మాటలివి. వృద్ధ గౌతమి నదిపై రూ. 44 కోట్ల 50 లక్షలతో గుత్తెనదీవి- బైరవలంక వంతెన, రూ. 76 కోట్ల 90 లక్షలతో జి.మూలపొలం వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కానీ ఇప్పటివరకు వృద్ధ గౌతమి నదిపై వంతెన నిర్మాణం జరలేదు. ఫలితంగా గోగుల్లంక, భైరవలంక గ్రామస్థులు నిత్యం పంటుపై రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి రోజూ 60 మంది విద్యార్థులు పంటు మీదుగా జి.వేమవరంలోని పాఠశాలకు వెళ్తున్నారు.
వరదల సమయంలో పంటు నిలిపివేయడంతో ఆ దీవుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు జి.మూలపొలం వంతెన పనుల్లోనూ ఎలాంటి పురోగతి లేదు. దీంతో పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని 8 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ముమ్మిడివరం- కాట్రేనికోన రహదారి విస్తరణకు రూ. 23 కోట్ల 52 లక్షల విలువైన పనులకు శిలాఫలకాలను ఆవిష్కరించినా డబ్బులు రావన్న భయంతో గుత్తేదారులు నేటికీ పనులు ప్రారంభించలేదు.
జగన్ బస్సు యాత్రతో జనానికి చుక్కలు - ఆస్పత్రిలో రోగుల అవస్థలు, దుకాణదారుల గగ్గోలు
గోదావరి వరదల సమయంలో ముంపు గ్రామాల్లో పర్యటించినప్పుడు సీఎం జగన్ ఇచ్చిన హామీలివి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని పొట్టిలంక, ఠాణేలంక, కూనలంక, గురజాపులంక, వివేకానందవారధి, కొండుకుదురు పరిధిలో కోత నివారణకు రక్షణ గోడ నిర్మిస్తామన్నారు. మూడున్నర కిలోమీటర్ల మేర నిర్మాణానికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పినా ఇప్పటికీ పనులు మొదలుకాలేదు. వరి పంట కోతల సమయంలో మిగ్‌జాం తుపాను విరుచకుపడటంతో పలు చోట్ల ధాన్యమంతా కల్లాల్లోనే తడిసిపోయింది. తేమ, ఇతర నిబంధనలు పక్కనపెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం అధికారులను అదేశించారు. అయితే సీఎం ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఏమాత్రం అమలు కాలేదు. దీంతో వరి పంట సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కోనసీమ అంటేనే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి. కొబ్బరి ఉత్పాదకతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గోదావరి జిల్లాల్లో లక్షా 26 వేల ఎకరాల్లో జరిగే కొబ్బరి సాగుపై 3 లక్షల మంది రైతులు ఆధారపడ్డారు. గిట్టుబాటు ధర లేక వారి పరిస్థితి దయనీయంగా మారింది. క్వింటా కొబ్బరి గిట్టుబాటు ధర రూ. 15 వేలు కాగా ప్రస్తుతం రూ. 12 వేలు కూడా రావడం లేదు. పైగా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఉపాధి కోసం పలువురు తమిళనాడు, కేరళ వెళ్తున్నారంటూ ప్రతిపక్ష నేతగా ఆవేదన వ్యక్తం చేసిన జగన్ సీఎం అయ్యాక వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.