AP Cabinet Meeting Updates Today : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ర్యాటిఫికేషన్ సహా వాలంటీర్ల వ్యవస్థ, రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలపై వస్తున్న ఫిర్యాదులు చేపట్టాల్సిన చర్యలపైనా కేబినెట్లో చర్చించనున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో నిబంధనలపై చర్చించే అవకాశం ఉంది. ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించే అంశంపై చర్చలు జరపనున్నారు. ఎన్నికల హామీగా ఈ నిబంధనను తప్పిస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది.
AP Cabinet Meeting 2024 : అదేవిధంగా మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ మంత్రివర్గంలో తీర్మానం చేసే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టు అంశంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు, ఎయిర్ స్ట్రిప్‌ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేర్వేరు ప్రభుత్వ రంగ సంస్థలు, శాఖల్లో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన అంశంపై కూడా చర్చించేందుకు ఆస్కారం ఉంది. అన్న క్యాంటీన్లు సహా సంక్షేమ పథకాల అమలుకు కేబినెట్ ఆమోదాన్ని తెలపనుంది.
అదేవిధంగా మత్స్యకారుల జీవనోపాధికి గండి కొట్టేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దుపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై, నూతన ఎక్సైజ్ విధానంపైనా చర్చిస్తారని సమాచారం. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూముల రీసర్వే పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీఎం చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. వీటిపై కూడా కేబినెట్లో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Chandrababu Visit Guntur and Bapatla Districts : కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హెలికాప్టర్లో బాపట్ల జిల్లా వేటపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చీరాల జంద్రాపేటలోని బీవీ అండ్ బీఎన్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికుల గృహలను చంద్రబాబు స్వయంగా సందర్శించనున్నారు. అనంతరం వీవర్స్ సర్వీస్ సెంటర్ స్టాల్స్‌ను సందర్శిస్తారు. ఈ క్రమంలోనే స్థానిక చేనేత కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆ తర్వాత వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తిరిగి ఆరు గంటలకు ఆయన హెలికాప్టర్లో ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
National Handloom Day 2024 : మరోవైపు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతమైన నేత కళను ప్రపంచానికి చేనేత కార్మికులు అందిచారని గుర్తు చేశారు. తద్వారా మన దేశ ప్రతిష్టను పెంచారని తెలిపారు. అలాంటి వారిని ప్రోత్సహించడం అందరి బాధ్యతని చెప్పారు. ప్రభుత్వపరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సమగ్ర చేనేత విధానం తీసుకువచ్చి, సబ్సిడీలను పునరుద్ధరిస్తామన్నారు. ఫలితంగా వారి కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతామని పేర్కొన్నారు. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకతకు నెలవైన చేనేతకు పునర్వైభవం తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.