CM Anger Against the Officials : వరద ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదని హెచ్చరించారు. బాధితులకు సహయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని సూచించారు.
తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న స్థాయిలో ఆహారం తెప్పించగలిగినా పంపిణీ విషయంలో జాప్యంపై సమావేశంలో సమీక్షించారు. బుడమేరు ముంపు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న కొందరు ఉన్నతాధికారుల కారణంగా పంపిణీలో జాప్యం అని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. నాడు జగన్ భక్త అధికారులుగా ముద్రపడి, నాడు వైకాపాతో అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న చోట సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు.
పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఆయా అధికారులు వ్యవహరిస్తున్న విషయం గుర్తించామని మరో మంత్రి చెప్పారు. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా తన పరిశీలనకు వచ్చిన అంశాలను రాసుకుని వచ్చి మంత్రి సీఎంకు ఇచ్చారు. వీఆర్‌లో ఉన్న డీఎస్పీ నుంచి డిఐజీ స్థాయి అధికారులు వరద బాధిత ప్రాంతాల్లో డ్యూటీకి వచ్చారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే ఉద్దేశ్యంతో ఆయా అధికారులు సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆటంకాలు కల్పిస్తున్నారని సీఎం సమీక్షలో చర్చ జరిగింది.
వివిధ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న కొల్లి రఘురామిరెడ్డి, విజయారావు, రఘువీరా రెడ్డి, శ్రీకాంత్, సత్యానంద్, గోపాలకృష్ణ వంటి అధికారులకు అక్కడ డ్యూటీలో ఉన్నారన్నారు. మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సీఎం ఆయా అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతంలో పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వీఆర్‌లో ఉన్న ఆ అధికారులకు బందోబస్తులో భాగంగా అక్కడ డ్యూటీలు వేశామని అధికారులు తెలిపారు. పని చేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లాలని ప్రజలు బాధల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు.
Chandrababu Reviews on Floods : వరద పరిస్థితులపై చంద్రబాబు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వరుసగా ఆయన సమీక్షలు నిర్వహిస్తూ సహాయ చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు.
అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి : పునరావాస కేంద్రాలకు వచ్చే వారికి దుస్తులు సిద్ధంగా ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. బాధితుల సెల్‌ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కమ్యూనికేషన్లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి కూడా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. సమస్యను రెండు మూడు రోజుల పాటు ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
బోట్లలో వెళ్లడానికి అవకాశం లేని పరిసరాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలని సూచించారు. హార్ట్ పేషెంట్లు, చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని ఆదేశాలిచ్చారు. ఒకే ప్రాంతంలో సాయం అందించడం కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలని చెప్పారు. కృష్ణానదికి వస్తున్న వరదనీటిపైనా సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నానికి కొంతమేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లంకగ్రామాల్లో సమస్యలపై స్థానిక అధికారులను అప్రమత్తం చేయమని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
నాతో సహా అందరూ బృందాలుగా ఏర్పడాలి : అంతకుముందు వరద సహాయక చర్యలపై ఉదయం సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై ఆరా తీశారు. గండిని పూడ్చగలిగామని చంద్రబాబుకు అధికారులు వివరించారు. రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవను ఆయన అభినందించారు. కరకట్ట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తనతో సహా అధికారులంతా బృందంగా ఏర్పడాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
దటీజ్ చంద్రబాబు - అర్ధరాత్రి బోటులో బాధితులకు భరోసా - Chandrababu Visit Vijayawada
వరదల సహాయం కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సాయం కావాల్సిన, ఆపదలో ఉన్నవారు ఫోన్ చేయొచ్చని అధికారులు తెలిపారు. వీఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ - +91 81819 60909, వీఎంసీ ల్యాండ్‌లైన్ నెంబర్ - 0866-2424172, 0866-2427485, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెం. - 0866-2575833, కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెం. 18004256029, కలెక్టరేట్ టోల్‌ఫ్రీ నెం. 112 , 1070