CM Chandrababu Press Meet on Flood Relief Measures: బుడమేరుకు గండి పడితే గుర్తించలేని వారు, జరిగిన తప్పిదానికి పశ్చాత్తాప పడకపోగా ఎదురుదాడి చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎక్కడికక్కడ బుడమేరును కబ్జా చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఉందనే నమ్మకంతో ఉన్న ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు మోపి దిగిపోయారని విమర్శించారు.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకునేందుకు ఎవరికి నచ్చిన విధంగా వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నష్టంపై కేంద్రానికి ప్రాథమిక అంచనా నివేదికను శనివారం ఉదయం పంపుతామని తెలిపారు. ఇళ్లు ఇతరత్రా వస్తువులు కోల్పోయిన వారికి ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు చెప్పారు. సబ్సిడీపై 40వేల కిలోల కూరగాయలు 10రూపాయల లోపే అందించే ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు.
సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటూ పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్‌మెంట్‌ను ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవ చేసే వారికి రేటింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. నైపుణ్యం ఉన్న పని వారిని వరద సాయం కోసం వినియోగించి వారికి జీవనోపాధి కల్పిస్తున్నామని తెలిపారు. వరదల వల్ల ఇప్పటి వరకూ 28మంది చనిపోయినట్లు గుర్తించామని చెప్పారు. బాధితుల నుంచి తీసుకున్న సర్వేలో పారిశుద్ధ్యం 76.2 శాతం బాగా జరిగిందన్నారని తెలిపారు. వైద్య క్యాంపులపై 76శాతం మంది సానుకూలంగా స్పందించారని తెలిపారు. అగ్నిమాపక యంత్రాలు ద్వారా ఇప్పటివరకు 10వేల ఇళ్లు శుభ్రం చేశామన్నారు. మరో 2 రోజుల్లో 100శాతం నిత్యావసరాల కిట్లు పంపిణీ పూర్తవుతుందని సీఎం స్పష్టం చేశారు.
బుడమేరుకు చేరుకున్న ఆర్మీ - గండ్లు పూడ్చివేత పనులు వేగవంతం - LEAKAGE WORKS Under Indian Army
బుడమేరు మూడో గండి త్వరగా పూడ్చడమే మా లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న 9 వేల క్యూసెక్కులు రావటంతో మళ్లీ ఇబ్బంది పడ్డామని అన్నారు. బుడమేరు గండి పూడ్చటం సైన్యానికి సైతం కొత్త పనని వివరించారు. కొల్లేరు, బుడమేరు, కృష్ణానదిని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించినట్లు తెలిపారు. సాయం చేయాలని కేంద్రాన్ని ఇంకా కోరుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్) కింద సాయం చేయాలని అందరిని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. అనేకమంది వచ్చి వరద బాధితులకు సాయం చేస్తున్నారని ఇలాంటి సమయంలో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశాను. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించి కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతం వరకు చూశాను. బుడమేరు గండ్లు వేగంగా పూడ్చాలని మరోసారి ఆదేశించాను. ప్రస్తుతం బుడమేరుకి రెండు గండ్లు పూడ్చాం మరోదాన్ని పూడ్చాలి. త్వరగా ఆ గండ్లను పూడ్చడం మా లక్ష్యం. బుడమేరు మూడో గండి పూడ్చేందుకు సైన్యం కూడా వచ్చారు. ఆ గండిని ఈ రాత్రికి పూడ్చాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాము. 149 అర్బన్, 30 రూరల్ సచివాలయాల నుంచి పనులు చేపట్టాము. వరదముంపు ప్రాంతాల్లో వైద్యశిబిరాలు కొనసాగుతున్నాయి. 3.12 లక్షల ఆహార పొట్లాలు, 11.5 లక్షల వాటర్ బాటిల్స్ పంపిణీ చేశాము.- చంద్రబాబు, సీఎం