CM Chandrababu Met With officials of Water Resources Department : సచివాలయంలో జలవనరులశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సీఎం సందర్శించే అవకాశమున్నట్టు సమాచారం. మరో వైపు శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలోనే ఉండాలని, కచ్చితంగా సమయ పాలన పాటించాలని నిర్ణయించారు.
'మా కలనెరవేరుస్తున్నందుకు థాంక్యూ సార్'- మెగా డీఎస్సీపై రాష్ట్ర వ్యాప్త సంబరాలు - MEGA DSC in ap
అలాగే జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించే అవకాశముంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి రోజు సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సీఎం సూచించారు. శాఖలపై పట్టు పెంచుకోవాలని, పాలనా పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతా : అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్, ఐపీఎస్ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టం చేశారు. గురువారం (జూన్ 13న) సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలకు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి ఐదారు నిమిషాలు మాట్లాడారు. వీరందరినీ తొలుత సీఎం కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు. బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక సీఎం అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు.
నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది : రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తానెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర, ప్రజావ్యతిరేక విధానాలే కారణమన్నారు. ఈ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లకూ కీలకపాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు. తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదన్న చంద్రబాబు, తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని చెప్పారు. నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది. మళ్లీ పరిపాలన గాడిలో పెడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
పెద్దాయన వచ్చారు, పండుగ తెచ్చారు- సీఎం చంద్రబాబుకు రైతుల ఘనస్వాగతం - Farmers Grand Welcome to CBN