AP Govt Focus on National Highways : కేంద్రం రాష్ట్రంలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణ ప్రాజెక్టులు మంజూరు చేసినా అవి సకాలంలో పూర్తయ్యేలా చూడటంలో గత ప్రభుత్వం విఫలమైంది. చిన్న సమస్యలూ పరిష్కరించలేక పనులు పడకేసేలా చేసింది. భూసేకరణలో జాప్యం, అటవీ భూముల అంశాలను ఏవీ వైఎస్సార్సీపీ సర్కార్ పట్టించుకోలేదు . దీంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) నిధులు ఇచ్చి పనులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నా పనులు ముందుకు సాగలేదు.
ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు : గత వారం దిల్లీ నుంచి వచ్చిన మోర్త్ ఉన్నతాధికారులు ఎన్‌హెచ్ ప్రాజెక్టుల్లోని సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించారు. భూసేకరణ సమస్యలకు సీసీఎల్‌ఏ, అటవీ భూముల అంశాలపై అదనపు పీసీసీఎఫ్‌తో పాటు, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శితో కమిటీ వేసి, వేగంగా సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ప్రతినెలా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
వాహనదారులకు గుడ్ న్యూస్ - ఆరు వరసలుగా ఆ రహదారి విస్తరణ - Hyderabad Vijayawada Highway
వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం :
- మోర్త్ పరిధిలోని 30 ప్రాజెక్టుల్లో ఎక్కువ జాప్యం నెలకొంటోంది. 761 కిలోమీటర్ల పొడవైన రహదారి పనుల విలువ రూ.6,695 కోట్లు.
- వీటిలో 15 ప్రాజెక్టులకు భూసేకరణ చేయకపోవడంతో గుత్తేదారుకు పనులే అప్పగించలేదు.
- ముదిరెడ్డిపల్లె నుంచి నెల్లూరు సరిహద్దు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిలో 7.5 కిలోమీటర్ల మేర కడప జిల్లాలో భూ సమస్య ఉంది.
- కత్తిపూడి - ఒంగోలు ఎన్‌హెచ్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు వద్ద అర కిలో మీటర్ బైపాస్, పాసర్లపూడి వద్ద 2.5 కిలో మీటర్ల మేర బైపాస్ పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. అక్కడి భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని అన్నదాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సర్కార్ వారితోనూ చర్చించలేదు.
- పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నుంచి నకిరేకల్ సెక్షన్‌లో 38 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి భూసేకరణలో చిక్కులు ఉన్నాయి.
- మోర్త్‌కు చెందిన తొమ్మిది ప్రాజెక్టులు అటవీ భూముల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆ శాఖతో చర్చించే యత్నమూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయలేదు.
- భద్రాచలం - కుంట తీయ రహదారిలో 2 కిలోమీటర్ల విషయంలో ఏపీ, తెలంగాణ అటవీ శాఖల మధ్య వివాదముంది.
- వైఎస్సార్ జిల్లాలో కమలాపురం సమీపంలో పాపాఘ్ని నదిపై వంతెన నిర్మాణం 74 శాతం జరిగాక, అటవీ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో నిర్మాణం ఆగిపోయింది.
- పల్నాడు, ప్రకాశం జిల్లాలో తీయ రహదారి పనులకూ అటవీ శాఖ క్లియరెన్స్ రాలేదు.
పట్టాలెక్కుతున్న పురోగతి- ఎన్డీయే ప్రభుత్వంతో రహదారులకు మోక్షం - Widening of National Highway 44