CID Inquiry Madanapalle Incident : వైఎస్సార్సీపీ పాలనలో భూ దందా, అక్రమాలను కప్పిపుచ్చే లక్ష్యంతో సాగిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనం కేసు గుట్టు తేల్చేందుకు సీఐడీ విచారణను ముమ్మరం చేసింది. అగ్నిప్రమాదంలో దగ్ధమైన దస్త్రాల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు కుట్రలో గత పాలకుల హస్తం ఉందన్న ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సిఐడీ విచారణను విస్తృతం చేసింది.
శాంతి భద్రతల విభాగం చేపట్టిన విచారణలో సేకరించిన ఆధారాలతో సీఐడీ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు.సీఐడీ విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆ రోజు జరిగిన ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి వివరాలు సేకరించారు. అగ్నిమాపక సిబ్బందిని ప్రమాదం జరిగిన రోజున ఎన్ని గంటలకు ఘటనాస్థలానికి వచ్చారు? మంటలను అదుపు చేసేందుకు పట్టిన సమయం గురించి ఆరా తీశారు.
Madanapalle Files Burnt Case : సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ కూర్చునే ప్రాంతంలో బీరువాలు అందులో ఉన్న ఆయిల్ క్యాన్ల గురించి సీఐడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వీడియో రికార్డ్ చేశారు. ట్రాన్స్‌కో అధికారులను పిలిపించి విచారించారు. ప్రమాదం జరిగిన రోజు ఇచ్చిన నివేదికను వారి ముందుంచి వాటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా అంటూ వారిని ప్రశ్నించి వివరాలు రాబట్టారు.
ఘటన జరిగిన రోజు పరిస్థితులను సీన్ రీకన్‌స్ట్రక్షన్, విచారణ ముగిసిన అనంతరం రవిశంకర్ అయ్యన్నార్ వెళ్లిపోయారు. సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ స్థానికంగా ఉండి విచారణ సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు సబ్ కలెక్టరేట్ సిబ్బందిని విడివిడిగా విచారించారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి పదిన్నర గంటల వరకు కార్యాలయంలో ఉన్న ఉద్యోగి గౌతమ్ తేజ, వీఆర్‌ఏ రమణయ్యతో పాటు మిగతా సిబ్బందిని విచారించారు. కొంతమంది ఉద్యోగుల నుంచి రాతపూర్వకంగా వివరణలు తీసుకున్నారు.
అజ్ఞాతంలోకి పెద్దిరెడ్డి అనుచరులు : మరోవైపు దస్త్రాల దహనం జరిగాక అనుమానితులుగా భావించి పోలీసుల విచారణ ఎదుర్కొన్న వైఎస్సార్సీపీ నేతల్లో తిరిగి ఆందోళన మొదలైంది. కేసు సీఐడీకి బదిలీ అయ్యాక విచారణ మందగించడంతో ఊపిరి పీల్చుకున్న ఆ నాయకలకు తిరిగి మళ్లీ ప్రారంభమవడంతో వణుకు మొదలైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మాధవరెడ్డితో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
మదనపల్లె ఫైల్స్ దహనం కుట్ర వెనక ఎవరున్నా వదలం: మంత్రి అనగాని - Minister Anagani Interview