Cheating in Aadudaam Andhra Tournament: సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో అయితే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారో కాని వారి పార్టీ నాయకులు మాత్రం ఆటల్లో కలుగుజేసుకుని వారికి నచ్చిన జట్టును ఎంపిక చేసుకుని మిగతా జట్లకు అన్యాయం చేస్తున్నారు. క్రీడల్లో ఈ దిక్కుమాలిన రాజకీయాలేంటంచూ యువత మండిపడుతోంది. ఆటల్లో తాము గెలిచినా నచ్చినవారికే గెలుపు పట్టాలు ఇస్తూ, తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గుర్తింపు లేని క్రీడాకారులను పైకి తీసుకుని వచ్చేందుకు ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, స్థానిక నేతల తీరుతో క్రీడా స్పూర్తికి తూట్లు పడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లాలో ఈ కార్యక్రమానికి అటు అధికా రులు, ఇటు నాయకులు వ్యవహరించిన తీరు..వైసీపీ మార్కు రాజకీయాలను చూపిస్తుందనే వాదన వ్యక్తమవుతోంది.
'ఆడుదాం ఆంధ్ర'లో చీటింగ్ - నాయకులు చెప్పినవారిదే గెలుపు
జిల్లాలోని వల్లూరు మండల సచివాలయం పరిధిలోని యువత క్రికెట్ పోటీలలో తమకు అన్యాయం జరిగిందంటూ కడపలో మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి తాము ప్రతి ఆటలో విజయం సాధించుకుంటూ జిల్లా స్థాయికి వచ్చామన్నారు. ఈ నేపథ్యంలో నిన్న కడప కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో తమ జట్టుకు ప్రొద్దుటూరు పరిధిలోని లైట్పాలెం సచివాలయ పరిధిలోని జట్టుకు క్రికెట్ పోటీలు నిర్వహించారని తాము మొదటి బ్యాటింగ్ తీసుకుని 140 పరుగుల మేరకు చేసి ఆలౌట్ అయ్యామని అన్నారు.
'ఆడుదాం ఆంధ్ర'లో గొడవలు - సహనం కోల్పోతున్న క్రీడాకారులు
తరువాత బ్యాటింగ్కు దిగిన ప్రొద్దుటూరు లైట్పాలెం వారు ఇంకా 10 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉందని ఓడిపోతామని ఉద్దేశంతో మైదానంలోనే లేనిపోని ఆరోపణలు చెప్పి ఆటను మధ్యలోనే అర్ధాంతరంగా ముగించి వేశారని అన్నారు. నిబంధన ప్రకారము సచివాలయ పరిధిలో ఉండే వారు మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతివ్వాలి. అయితే తమ జట్టులో కేవలం ఒక వ్యక్తి మాత్రమే వేరే ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. కానీ లైట్పాలెం జట్టులో 11 మంది కూడా సచివాలయ పరిధిలో వారు కాకుండా ఇతర ప్రాంతానికి చెందినవారు ఉన్నారని అన్నారు. అయినప్పటికీ అధికారులు వారిని రద్దు చేయకుండా మధ్యలో ఆటను రద్దుచేసి ప్రొద్దుటూరు లైట్పాలెం జట్టు గెలుపొందినట్లు ప్రకటించడం దారుణమని ఖండించారు.
'ఆడుదాం ఆంధ్ర' పోటీల్లో బాహాబాహీ- ఇరుజట్ల మధ్య తీవ్ర వాగ్వాదం
దీని వెనకాల ప్రొద్దుటూరులో ఉండే సచివాలయ సిబ్బంది కమిషనర్, ఎమ్మెల్యే హస్తం కూడా ఉందని వారు వాపోయారు. ఆడుదాం ఆంధ్ర అనే పదానికి అర్థం ఉండదని ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. కనీసం న్యాయం చేసేందుకు జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లగా గా ఆయన కూడా తమను పట్టించుకోకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వల్లూరు జట్టు యువత వాపోయారు.