CHANDRABABU PRAJA GALAM MEETING: జగన్ మోహన్ రెడ్డి అబద్దాల్లో పీహెచ్డీ చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజాగళం పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలోని రాజాం, పలాస సభల్లో పాల్గొన్నారు. తొలుత విజయనగరం జిల్లా రాజాం ప్రజాగళం సభలో పాల్గొని సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీడీపీ 5 ఏళ్లల్లో ఉత్తరాంధ్ర జలవనరుల ప్రాజెక్టులకు 1,600 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ రెడ్డి 594 కోట్లు మాత్రమే పెట్టారని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామ తీర్ధ సాగర్, తోటపల్లి ప్రాజెక్ట్, వంశధార-నాగావళి అనుసంధానం విషయంలోనూ వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది అంతంత మాత్రమేనని తెలిపారు. జగన్ రెడ్డికి తప్పుడు వార్తలు రాసే పత్రిక, సలహాదారులకు వందల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. వాటికి బదులు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఖర్చు పెట్టి ఉంటే ప్రజలకు జలవనరులు పుష్కలంగా అందేవని తెలిపారు.
భోగాపురం పూర్తి కాకపోవడానికి ముఖ్యమంత్రి జగన్ కారణం: రివర్స్ పాలనలో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణం బాధ్యతలను ఉత్తరాంధ్ర గడ్డ మీద పుట్టిన జీఎంఆర్‌కు అప్పజెప్పాను. అలాగే 2 వేల 700 ఎకరాలు భూసేకరణ చేసి బోగాపురం ఎయిర్ పోర్టును తీసుకువచ్చామని తెలిపారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పూర్తయి ఉండేదని, తద్వారా ఈ ప్రాంతానికి పరిశ్రమలు తరలివచ్చేవని, ఉద్యోగాలు వచ్చి ఉండేవని పేర్కొన్నారు. కానీ తిక్కలోడు రివర్స్ చేసి టెండర్ మళ్లీ పిలిచారని, మళ్లీ శంకుస్థాపన చేశారన్నారు. భోగాపురం పూర్తి కాకపోవడానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని దుయ్యబట్టారు.
ఉత్తరాంధ్రకు టీడీపీ పరిశ్రమలు తెస్తే, జగన్ గంజాయి, డ్రగ్స్ తెచ్చారని విమర్శించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి 550 ఎకరాలు ఇచ్చి విశాఖ దగ్గరలో ప్రారంభించామన్నారు. ఇప్పుడు జగన్ రివర్స్ పాలనతో ఆ విశ్వవిద్యాలయం ఎక్కడికి వెళ్లిందో తెలియదని అన్నారు. భావనిపాడు పోర్టుకు శంకుస్థాపన చేసి టెండర్లు పిలిస్తే జగన్ డబ్బుల కోసం కక్కుర్తి పడి వేరే వాళ్లకు టెండర్లు అప్పగించారని ఆరోపించారు. టీడీపీ చేపట్టిన పనులు పూర్తయి ఉంటే ఈ ప్రాంతం హైదరాబాద్ కంటే మెరుగ్గా అభివృద్ధి చెంది ఉండేదని తెలిపారు. విశాఖలో వైసీపీ కబ్జాతో ఉత్తరాంధ్ర విలవిలలాడిందని, 40వేల కోట్ల ఆస్తులను లాక్కున్నారని, దారుణంగా ప్రవర్తించారని అన్నారు.
జూన్ 4న అమరావతి రక్షణ - జగనాసుర వధ : చంద్రబాబు - Chandrababu Election Campaign
విశాఖ భూములపై మాత్రమే జగన్ ప్రేమ: ఉత్తరాంధ్రకు విదేశాల నుంచి టీడీపీ పరిశ్రమలు తెస్తే, జగన్ భూ సెటిల్ మెంట్లు తెచ్చారని మండిపడ్డారు. విశాఖను తాము వాణిజ్య రాజధానిగా చేస్తే, జగన్ గంజాయి, డ్రగ్స్ రాజధానిగా చేశారని ధ్వజమెత్తారు. నాడు టీడీపీ హయాంలో అదానీ, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ వంటి మల్టీ నేషనల్ కంపెనీని తెస్తే జగన్ తరలిమేశారని విమర్శించారు. జే 'గన్' రెడ్డికి విశాఖ ప్రజల అంటే ప్రేమ లేదు, విశాఖ భూములపై మాత్రమే ఉందని దుయ్యబట్టారు. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనం ఏంటన్న చంద్రబాబు, ఒక సామన్య కార్యకర్తను అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత తనదని అన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు జగన్ రెడ్డి ద్రోహం చేశారని చంద్రబాబు విమర్శించారు. 5 ఏళ్లుగా అందరిపై కేసులు బనాయించారని, ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయిందని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్‌లు పెట్టుకోగలుగుతున్నామని అన్నారు. తన ఆవేదన, తన బాధ పేద ప్రజల కోసం మాత్రమే అని అన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు తనకు ఉందని, జగన్ రెడ్డిపై గులకరాయి పడితే తెలుగు జాతిపై దాడి అని సజ్జల మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తాను 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు తన భార్య భయటకు రాలేదని తెలిపారు. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో ఇష్టానుసారంగా తిట్టారని, ఒక ఆడబిడ్డకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. అందుకే ఆమె రాష్ట్రం మీద బాధ్యతతో నిజం గెలవాలి అనే కార్యక్రమం పేరుతో ఊరూరా తిరిగారని తెలిపారు. తనను వైసీపీ ఇబ్బందులకు గురి చేస్తే 203 మంది ప్రాణాలు వదిలిపెట్టారని, చనిపోయిన కుటుంబాలకు ఆమె ఆర్ధిక సాయం చేసి ధైర్యాన్ని ఇచ్చారని అన్నారు. ఆ పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌లో చదివిస్తానని హామీనిచ్చారన్నారు.
జగన్ చేసేవి శవ రాజకీయాలు - నావి ప్రజా రాజకీయాలు: చంద్రబాబు - Bapatla Prajagalam Sabha
ఏపీకి సమర్థవంతమైన డ్రైవర్ నేనే: ఏపీ డ్రైవర్ తానే అని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా సమర్ధవంతంగా రాష్ట్రాన్ని నడిపించానని అన్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గట్టెక్కించాలన్నదే తన కోరిక, ఆశయం అని తెలిపారు. అందుకే ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలంటే అభిమానం ఉంటే వ్యక్తి, బాధ్యతతో ప్రవర్తించే వ్యక్తి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే ప్రజలను కాపాడతానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. నరేంద్ర మోదీనే మూడో సారి ప్రధానమంత్రి అవ్వబోతున్నారని, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలనేది తన చివరి కోరిక అని, ప్రజల రుణం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి ఏ విధంగా సేవ చేశానో అంతకంటే మెరుగైనా పాలన చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. సంపద సృష్టించి, ఆదాయం తెచ్చి ప్రజలకు ఖర్చు పెట్టాలని అన్నారు.
జాబు రావాలంటే బాబు రావాలి: ఈ ముఖ్యమంత్రి వలన బాదుడే బాధుడు అని, కరెంట్ ధరలు, పెట్రోల్ డీజీల్, నిత్యావసర ధరలు, పన్ను ధరలు, ఆర్టీసీ ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. ఏ ప్రభుత్వమైన ప్రజల ఖర్చులు తగ్గించాలి, ఆదాయం పెంచాలని, కాని ఇక్కడ ప్రజలతో పాటు ప్రభుత్వం అప్పుల పాలయ్యాయని తెలిపారు. డీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్, సర్వీస్ కమీషన్ లేదని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా 25 వేల కానిస్టేబుల్ ఉద్యగాలు ఇస్తానని హామీనిచ్చి ఒక్క పోస్ట్ అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు. అందుకే జాబు రావాలంటే బాబు రావాలని అన్నారు.
'లక్షలు సంపాదించే మార్గం చూపిస్తా: కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో రైతుకు 20 వేలు అందిస్తామని, ప్రతి పేదవాడికి 4 వేల పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వెనకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, పేద వాళ్లను ఆదుకోవడానికి కేంద్రం గరీబీ కింద రేషన్ బియ్యం కొనసాగిస్తుందని తెలిపారు. పేదరికం నుంచి పైకి తేవడానికి కృషి చేస్తానని, సాంకేతికతను ఉపయోగించుకొని అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. వాలంటీర్ల జీతాలు 10 వేలు చేస్తామన్న చంద్రబాబు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక్కొక్కరు లక్షలు సంపాదించే మార్గం చూపిస్తానని అన్నారు. వైసీపీతో ఉంటే వాలంటీర్లు ఊడిగం చేయాల్సిందే అని విమర్శించారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది: అనంతరం పలాస ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తనకు పదవి అనేది బాధ్యత అయితే జగన్‌కు వ్యాపారమని ధ్వజమెత్తారు. విశాఖ నుంచి భావనపాడు వరకు పరిశ్రమలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఉద్యోగులకు డీఏ సహా గౌరవప్రదంగా పని చేసుకునే వాతావరణం కల్పిస్తామన్నారు. రాష్ట్రలో దొంగలు పడ్డారని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలనే ధ్యేయంతో తాను పనిచేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయుత- అంబాజీపేటలో చంద్రబాబు - Chandrababu Naidu Election Campaign