CHANDRABABU PRAJA GALAM MEETING: కడప ఎవరి జాగీరు కాదని, ప్రజలు తలచుకుంటే ఎంతటివారైనా నేలకు దిగాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా కడపలో ఆయన భారీ రోడ్‌షో నిర్వహించారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయన్నారు. గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి వరాలు ఇచ్చిన జగన్, ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చంద్రబాబు నిలదీశారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రి ఉండి సీఎం జగన్ సొంత జిల్లాలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ను అటకెక్కించారని కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. రాయలసీమలో మళ్లీ హత్యా రాజకీయాలకు తెరలేపారని చంద్రబాబు విమర్శించారు. హత్య కేసు నిందితులను పక్కనపెట్టుకుని జగన్ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నవరత్నాల స్థానంలో నవమోసాలకు పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు..
నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, ఐదేళ్లల్లో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని దుయ్యబట్టారు. క్వార్టర్ రూ.60 నుంచి రూ.200కి అమ్ముతున్నారని, అంటే రూ.140 ఎవరి జేబులోకి వెళుతుందని ప్రశ్నించారు. నాశిరకం మద్యం అమ్ముతున్నారని, తమిళనాడు, తెలంగాణలోని నాణ్యమైన మద్యం ఇక్కడ దొరకడం లేదని ఆరోపించారు. అంతా జే బ్రాండ్లు వచ్చేశాయని విమర్శించారు. మద్యపాన నిషేదం చేశాకే ఓటు అడుగుతానని జగన్ అన్నారని, మరి చేశారా అని నిలదీశారు.
ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావాలని, గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలని తెలిపారు. రాష్ట్రాన్ని గంజాయి మయం చేసిన దుర్మార్గుడు జగన్ అని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికలకు ముందు ముద్దులు పెట్టి వరాలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చాక బాధుడే బాదుడు, గుద్దుడే గుద్దుడు జరుగుతోందని చంద్రబాబు అన్నారు.
కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయం - వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
పట్టాదారు పాస్ పుస్తకంపైన ఏ నాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా బొమ్మలు అయినా చూశామా అని ప్రశ్నించారు. జగన్ మాత్రం పట్టాదారు పాస్ పుస్తకంపై బొమ్మ వేసుకుంటున్నాడని, పత్రాలు ప్రజలవి బొమ్మలు జగన్‌వి అని విమర్శించారు. పక్కనే నిందితుడిని పెట్టుకొని పాపం పిల్లవాడు అని జగన్ అంటున్నారని, పిల్లవాడు అయితే పలకా, బలపం ఇచ్చి బడికి పంపాలి గాని పార్లమెంట్‌కి పంపిస్తారా అని ఎద్దేవా చేశారు.
మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ఇంటింటికీ గొడ్డలి వస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే తిరిగి అన్ని పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ తెలుగుదేశాన్ని ఆదరిస్తేనే కడప అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి అన్నారు.
సీఎం పదవి నాకు బాధ్యత- జగన్‌కు వ్యాపారం: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING