CHANDRABABU PRAJA GALAM MEETING: సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని, మీ కోపాన్ని, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా పాణ్యం ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. వైఎస్సార్సీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తిచేయలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు.
పాస్ పుస్తకాన్ని చించి తగలబెడుతున్నా: ప్రజల పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు అని ప్రశ్నించిన చంద్రబాబు, జగన్ ఫొటో ఉన్న పాస్ పుస్తకాన్ని చించి తగలబెడుతున్నానన్నారు. మీ భూములన్నీ ఆయన కాజేస్తే చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. మీ ఆస్తులు కొట్టేసేవాడు కావాలా, ఆస్తులు పెంచేవాడు కావాలా అని అన్నారు. మీ జీవితాలను మార్చే సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొస్తున్నానన్న చంద్రబాబు, సూపర్ సిక్స్‌తో పాటు మోదీ గ్యారెంటీ కూడా కలుపుతున్నానని హామీ ఇచ్చారు.
జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేసిన చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING
ఇంకెంతకాలం మోసం చేస్తారు: జగన్ అహంకారి, సైకో, విధ్వంసకారుడు, దోపిడీదారుడు అని విమర్శించారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ జగన్ సర్వనాశనం చేశారన్న చంద్రబాబు, జగన్ మానసిక స్థితిని అధ్యయనం చేస్తే నార్సి విధానమని తేలిందని అన్నారు. అబద్ధాలు పదేపదే చెప్పి నమ్మించేదే నార్సి విధానమని పేర్కొన్నారు. వాళ్లు చెప్పిందే చేయాలని, లేకపోతే దాడిచేసి చంపేస్తారని ఆరోపించారు. లాడెన్, తాలిబన్లు, కిమ్‌కు తాత ఈ జగన్ అని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు.
తనది విజన్ అని, జగన్‌ది పాయిజన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. తాను ముందుచూపుతో ఆలోచించి పనులు చేస్తానని, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచిన ఘనుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉర్దూ వర్సిటీ పెట్టానని, ఉర్దూ రెండో భాష తానే చేశానని చంద్రబాబు తెలిపారు. జగన్‌ది దిల్లీలో చీకటి ఒప్పందమని, గల్లీలో పోరాటమని పేర్కొన్నారు.
ఇప్పుడు కోడికత్తి, గులకరాయి దాడి నాటకాలాడారని, జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికల ముందు అమరావతే రాజధాని అన్నారని, అధికారంలోకి మూడు రాజధానుల నాటకమాడారని ధ్వజమెత్తారు. మూడు రాజధానులు కాదు, ఒక్క రాజధాని అయినా కట్టారా అని ప్రశ్నించారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగారని, ఇవాళ జనం ముందుకొచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
విధ్వంసానికి నాంది పలికారు: మీడియా ప్రశ్నిస్తుంటే వారిపైనా కేసులు పెట్టి వేధించారని అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడకూడదని జీవో నెం.1 తీసుకొచ్చిన సైకో జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికాడని, రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దుచేశారని దుయ్యబట్టారు.
నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న చంద్రబాబు, ఎక్కడా లేని బ్రాండ్లు, జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చారని ఆరోపించారు. తమ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే, ఇప్పుడు దొరక్కుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, జగన్ దోచేసిన డబ్బుపై తాను పోరాడుతున్నానన్న చంద్రబాబు, జగన్ దోచేసిన డబ్బు ప్రజలకు చేరాలని అన్నారు.