CHANDRABABU PRAJA GALAM MEETING: పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకంటూ జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చంద్రబాబు చించిపారేశారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడు పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించారు. ఏం చేశారో, ఏం చేస్తారో జగన్ చెప్పుకోలేపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారని, బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టానని తెలిపారు. జగన్ బడ్జెట్‌లో 10 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టారని తెలిపారు.
రక్తం పీల్చే జలగ జగన్ అని, తాను రక్తం ఇచ్చే రకమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీవి నవరత్నాలు అంటున్నారని అందులో మెుదటి నవరత్నం ఇసుక మాఫియా అని, జగన్ ఇచ్చిన రెండో నవరత్నం జే బ్రాండ్ మద్యం అని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత జే బ్రాండ్ మద్యం నిషేధించి మంచి మద్యాన్ని తక్కువకు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ మూడో నవరత్నం భూ మాఫియా, నాలుగోతర్నం మైనింగ్ మాఫియా, ఐదోతర్నం హత్యారాజకీయాలు, ఆరోరత్నం ప్రజల ఆస్తులు కబ్జా చేయడం, ఏడోరత్నం ఎర్రచందనం, గంజాయి, ఎనిమిదోరత్నం దాడులు, అక్రమ కేసులు, తొమ్మిదో రత్నం శవరాజకీయాలు అని ధ్వజమెత్తారు.
పాసుపుస్తకాన్ని చించిపారేయాలి: పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు అని, జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భూములను జగన్ దగ్గర పెట్టుకుంటారంటా, ప్రజల భూమి రికార్డులను ప్రైవేటు సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. ప్రజల భూమి సైకో జగన్ గుప్పిట్లో ఉందన్న చంద్రబాబు, మీ భూమిపై మీకు హక్కు ఉందా అని ప్రశ్నించారు. భూమి మీది అని,పెత్తనం జలగది అని విమర్శించారు. సైకో జగన్ అందరి మెడలకు ఉరితాడు వేశారన్న చంద్రబాబు, జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుందని అన్నారు. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత తనదని చంద్రబాబు తెలిపారు.
అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడంటా, అవినాష్ చిన్నపిల్లాడైతే పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపించాలని ఎద్దేవా చేశారు. స్కూలుకు పంపాల్సిన పిల్లాడిని పార్లమెంటుకు జగన్ పంపించారని అన్నారు. మన మ్యానిఫెస్టో కళకళలాడుతుందని, జగన్ మ్యానిఫెస్టో విలవిలలాడుతుందని మండిపడ్డారు. పింఛన్ రూ.2 వేలకు పెంచింది ఎవరు అని ప్రశ్నించిన చంద్రబాబు, జగన్ పేదల వ్యతిరేకి అని, పేదలను చంపి ఓట్లు పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇచ్చే బాధ్యత తనదని, పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తామని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత సహజమరణానికి రూ.5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య బీమా రూ.20 లక్షలు ఇస్తామని, నచ్చిన ఆస్పత్రిలో చికిత్స చేసుకోవచ్చని తెలిపారు. డ్రైవర్లకు రూ.10 వేలు ఇస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కాపాడతామన్నారు. మక్కా వెళ్లే ప్రయాణికులకు రూ.లక్ష ఇస్తామని, ఉద్యోగులకు మంచి పీఆర్ ఇస్తామని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఒకటో తేదీనే ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులకు రావాల్సిన బాకాయిలు, గౌరవాన్ని ఇస్తామని భరోసా ఇచ్చారు.
దర్శిలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూలు మళ్లీ తెస్తామన్న చంద్రబాబు, యువతకు ఉద్యోగులు ఇస్తామని, గంజాయి కావాలా జాబ్ కావాలా అని ప్రశ్నించారు. గంజాయి వద్దని, జాబు ముద్దని తెలిపారు. గతంలో తాళ్లూరులో మొగిలిగుండాల రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశామని, తాను శంకుస్థాపన చేసిన దానికి జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను వేయిస్తామని, హైదరాబాద్, తిరుపతికి వెళ్లాలంటే నేరుగా దర్శి నుంచే వెళ్లొచ్చని పేర్కొన్నారు