Chandrababu on Vijayawada Diarrhea Deaths: విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా బారిన పడి ఇప్పటి వరకు 9 మంది చనిపోగా, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.
విజయవాడలో మృత్యుఘోష - డయేరియా లక్షణాలతో మరణాలు - 9 diarrhoeal deaths In Vijayawada
Diarrhea Victims Family Members Agitation: బెజవాజలో డయేరియా లక్షణాలతో ఇప్పటి వరకు తొమ్మిది మంది మరణించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 250 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించినట్లు అధికారులు చెబుతున్నా ఇంతవరకూ ఒక్క దానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ప్రకటించలేదు. మృతుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించ లేదు. అతిసార వేగంగా విస్తరిస్తున్న వీఎంసీ (Vijayawada Municipal Corporation) యంత్రాంగం కనీసం నియంత్రణ చర్యలు చేపట్టలేదని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు. ఒకవైపు కళ్లముందే అతిసారం ప్రబలుతూ, పలువురు ప్రాణాలు కోల్పోతుంటే నీటి కాలుష్యం కాదంటూ వీఎంసీ కమిషనర్ కొట్టిపారేస్తున్నారు. ద్రవక్లోరిన్ కలపడం కారణంగానే నీరు పసుపు రంగులోకి మారిందని చెబుతున్నారు.
మరోవైపు కలుషిత నీళ్లు కారణంగానే తమ కుటుంబ సభ్యులు మరణించారని బాధిత కుటుంబ సభ్యులు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తమ కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొగలరాజపురంలో బాధితులు చేపట్టిన ఆందోళనకు సీపీఎం నాయకులు పాల్గొని మద్దతు ప్రకటించారు. పాడైపోయిన తాగునీటి పైపు లైన్ల మరమ్మతులు సకాలంలో చేయకపోవడం కారణంగానే ఈ మరణాలు సంభవించాయని సీపీఎం నాయకులు, స్థానికులు ఆరోపించారు.
తమ కుటుంబ సభ్యులు మరణించడానికి తాగునీరు కారణమైతే ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నాయని వీఎంసీ అధికారులు చెప్పడం దారుణమని బాధితులు వాపోతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టడంలో వీఎంసీ, వైద్యారోగ్య శాఖ అధికారులు విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. వీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు బాధితులను పరామర్శించడానికి రావడం లేదని విమర్శిస్తున్నారు. డయేరియాతో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ధర్నా చేపట్టిన సీపీఎం నాయకులు, బాధిత కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి.
విజయవాడలో కోరలు చాచుతున్న డయేరియా - ఇంకా కళ్లు తెరవని నగర పాలక సంస్థ! - Contaminated Drinking Water