Chandrababu Launched TDP Donation Website: తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్‌సైట్‌ను అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్లో లాంఛనంగా ప్రారంభించారు. https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్ధులకు సంబంధించి ఎక్కడైనా ఒకట్రెండు చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకరంతో మార్పు ఉండొచ్చని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల దగ్గర్నుంచే తాము విరాళాలు సేకరిస్తుంటే, వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరిస్తోందని మండిపడ్డారు. ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుమతించే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు.
ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వటంతో పాటు, ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకుని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని స్పష్టంచేశారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. ఎలక్ట్రోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్దంగా చేయొచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
దేశం సరైన దిశలో వెళ్తోంటే, ఏపీ రివర్సులో వెళ్తోందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కన్పిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత, నాణ్యమైన విద్యకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేసిన వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పిలుపునిచ్చారు.
కూటమి జెండాలు ప్రతీ ఇంటిపైనా ఎగరేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. కూటమిని ముందుండి నడపడం బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకూ సిద్ధం సభలకు కనీసం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను ఏదో మానవతావాదిలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐ ప్యాక్ టీం చాలా కష్టపడి జగన్‌లో మానవీయ కోణం చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
తాడేపల్లి ప్యాలస్‌లో డబ్బులను తూచేవారు: 420లంతా కలిసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని ఆక్షేపించారు. తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌తో పాటు, అన్ని తప్పుడు కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా చిత్ర విచిత్ర వేషాలేస్తారని అన్నారు. తాడేపల్లి ప్యాలస్‌లో డబ్బులను మిషన్ పెట్టి కూడా తూచేవారని ఆరోపించారు.
ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆ అవివీతి సంపదలో కొంత బయటకు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లల్లో డబ్బులు వెళ్తూనే ఉన్నాయన్నారు. బుధవారం నుంచి తాను, పవన్ కల్యాణ్ ఇద్దరం కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సభలు పెడుతున్నామని భాజపా నేతలు కూడా పాల్గొంటారని వివరించారు.