Chandrababu Cheepurupalli Sabha: ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట లాంటిదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉత్తరాంధ్రపై టీడీపీకి ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు బొత్సపై నిప్పులు చెరిగారు.
ఉత్తరాంధ్ర పదవులన్నీ బొత్స కుటుంబానికే కావాలని ఎద్దేవా చేశారు. సీట్లు ఇచ్చారని ఉత్తరాంధ్రను దోచుకున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మోదీ గురించి బొత్స కాదు, ధైర్యం ఉంటే జగన్ మాట్లాడాలన్నారు. బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చినది ఎంత, జగన్ తిన్నదెంతో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలే, ఎప్పుడూ నిజం మాట్లాడరని, తెలుగుదేశం పార్టీ వంద సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. విజయనగరం జిల్లాలో మూతబడ్డ పెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు తెరిపిస్తామని పేర్కొన్నారు. కిమిడి నాగార్జున భవిష్యత్తు నేను చూసుకుంటానని చంద్రబాబు వెల్లడించారు.
కరెంట్ ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పి జగన్ ఓటు అడగాలని చంద్రబాబు సూచించారు. నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారో చెప్పాలన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకే సూపర్ సిక్స్ తెచ్చామన్నారు. వచ్చే ఐదేళ్లు అద్భుతంగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. డ్వాక్రా సంఘాలు, పొదుపు సంఘాలు పెట్టింది తానే అన్న చంద్రబాబు, మరోసారి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందన్నారు. చీపురుపల్లిలో పరిశ్రమలు ఏర్పాటుచేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. తోటపల్లి పూర్తి చేసి నెలలోగా నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటామన్నారు. టీడీపీ ఎప్పుడూ రైతు సంక్షేమాన్ని పట్టించుకునే పార్టీ అని, బకాయిలతో కలిపి జులైలో రూ.7 వేలు పింఛను ఇస్తామన్నారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం జగన్ పని అన్న చంద్రబాబు, సంపద సృష్టించి పేదలకు పంచడం తన పని అని వెల్లడించారు. భూ పత్రాలపై రాజముద్ర కావాలా.. జగన్ ఫొటో కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
వైసీపీని ఓడిస్తే తప్ప మీ భూములకు భద్రత ఉండదని చంద్రబాబు వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలు ఏమీ నిలిచిపోవు, మరింత పెంచుతామన్నారు. ఉత్తరాంధ్రను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా చేయాలనుకున్నట్లు తెలిపారు. రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు మార్చే ఆయుధం.. ఓటని, గొడ్డలి మనింటికి రాకూడదంటే ఫ్యాన్ ముక్కలు కావాలన్నారు. అధికారం కోసం కోడికత్తి, గులకరాయి డ్రామాలు ఆడారని చంద్రబాబు దుయ్యబట్టారు.
జగన్ మీ బిడ్డ కాదు- రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ: చంద్రబాబు - CHANDRABABU fire on JAGAN