CEO Review with Election Officials on Polling Arrangements: రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు, రీపోలింగ్‌కు ఆస్కారం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని ఆయన తేల్చి చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన సీఈఓ ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై తక్షణం స్పందించాలని సూచనలు చేశారు. జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఎక్కడా ఉల్లంఘనలకు తావివ్వొద్దని స్పష్టం చేశారు. అదే సయమంలో ఎన్నికల ఉచితాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సూచించారు.
గంజాయి, అక్రమ మద్యం, నగదు అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీని ముమ్మరం చేయాల్సిందిగా సూచించారు. గోవా, హర్యాణ లాంటి రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వస్తున్నట్లు సమాచారం వస్తోందని, దీన్ని నివారించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులు, వ్యక్తుల వద్ద 50 వేల రూపాయలకు మించి నగదు ఉంటే తక్షణం జప్తు చేయాలని సూచించారు. వ్యాపారులు, సాధారణ పౌరుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. నగదు జప్తు కేసుల్ని 24 గంటల్లోగా పరిష్కరించాలన్నారు.
రాష్ట్రమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా ఓ ప్రామాణిక విధానాన్ని తీసుకువస్తామని సీఈవో జిల్లా అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అంశంపై ఈసీ నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. దీనిపై స్పష్టత వచ్చేలోగా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇంటింటి ప్రచారానికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని రిటర్నింగ్ అధికారికి, సంబంధిత పోలీసు స్టేషన్ కు ఇస్తే చాలన్నారు.
రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక అబ్జర్వర్లు ముగ్గురూ ఎన్నికల సంఘానికి కళ్లూ, చెవులని వీరు నేరుగా సీఈసీ నేతృత్వంలోనే పని చేస్తున్నారని సీఈఓ జిల్లాల అధికారులకు తేల్చి చెప్పారు. ప్రత్యేక సాధారణ పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా, వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ ఇప్పటికే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case
ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అమలు, ఎన్నికల ఏర్పాట్ల విషయంలో అబ్జర్వర్లు సంతృప్తి చెందేలా కార్యాచరణ ఉండాలని సీఈఓ స్పష్టం చేశారు. అటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సీఈఓ కార్యాలయం నుంచి పంపే ఫిర్యాదులపై జిల్లా స్థాయిలో సమగ్రమైన విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
మరోవైపు తనిఖీల సమయంలో దొరుకుతున్న నగదు విషయంలో ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు వివరాలు పంపాల్సిందిగా సూచించారు. ఎన్‌ఫోర్సుమెంట్ విభాగాలకు చెందిన అధికారులు నిఘా పెట్టటంతో పాటు నిరంతర తనిఖీలు చేయాలని సూచించారు.