CEO Mukesh Kumar Meena Review with Collectors : ఎన్నిక నగారా మోగటంతో అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను తొలగించాలని ఎన్నికల అధికారులను సీఈవో (CEO) ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం పరిసర ప్రాంతాల్లో హోర్డింగ్‌లను తక్షణమే తొలగించాలని పేర్కొన్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ బృందాలు విస్తృతంగా పర్యటించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు.
సీ విజిల్ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో అమలు అయ్యేలా చూడాలని సూచించారు. సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిబంధనలు అమలు చేయాలన్నారు. బహిరంగ స్థలాల్లోనూ నియమావళి తప్పనిసరి చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల లోపు రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని అధికారులకు స్పష్టం చేశారు.
హింస, రీపోలింగ్ లేని ఎన్నికల నిర్వహణే లక్ష్యం: శంకబ్రత బాగ్చి
ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు సంసిద్ధులయ్యారు. ఎన్నికల నిబంధనావళి అమలు చేస్తున్నారు. ఫ్లెక్సీల తొలగింపు, నేతల విగ్రహాలకు ముసుగులు వేసే పనులు చేపట్టారు. దీంతో నిన్నటి వరకు రంగు రంగుల పార్టీ జెండాలతో, పార్టీలకు చెందిన ఫ్లెక్సీలతో కళకళలాడిన ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతాలు నేడు వెలవెలబోతున్నాయి.
శనివారం వరకు రహదారులకు ఇరువైపులా నిలబడి ముసి ముసి నవ్వులతో పలకరించిన దివంగత రాజకీయ నాయకుల విగ్రహాలు ముసుగులు కప్పుకుని మౌనముద్ర వహిస్తున్నాయి. పార్టీలకు చెందిన ప్రచార ఫ్లెక్సీలతో కళకళలాడిన విద్యుత్ స్తంభాలు సైతం కళ కోల్పోయి బోసిపోయి నిలబడి చూస్తున్నాయి. ఇదంతా ఎన్నికల నగార మోత ఫలితమే.
అరాచకాలు, అక్రమాలే అర్హతలుగా వైసీపీ అభ్యర్థుల ఎంపిక- రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఇలాంటి వారే
ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని రాష్ట్రపతి రోడ్డు నరేంద్ర సెంటర్ వేల్పూర్ రోడ్డు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ తదితర కూడలి ప్రాంతాలు ఎన్నికల కోడ్ పుణ్యమా అని ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. పట్టణంలోని ఎన్టీఆర్, వైఎస్సార్, రాజీవ్ గాంధీ విగ్రహాలతో పాటు స్థానిక నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. ఫ్లెక్సీలను తొలగించారు. సంవత్సరాలు తరబడి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే విద్యుత్ స్తంభాలకు వేలాడదీసిన ఫ్లెక్సీలను సైతం అధికారులు తొలగించారు. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలకు చెందిన ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు.