VIZAG STEEL PLANT MERGE WITH SAIL : వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) మరో ప్రభుత్వరంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపునకు మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థకి భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.
స్టీల్‌ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా : స్టీల్ ప్లాంట్‌కు చెందిన 1500 నుంచి 2,000 ఎకరాలను ఎన్ఎమ్డీసీకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా వెల్లడించాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. అటు బ్యాంకు రుణాలపైనా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కుశాఖ కార్యదర్శి ఎస్‌బీఐ అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా వెల్లడించాయి.
నష్టాలకు అదే కారణమని అంచనా : నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలోనే నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పని చేస్తుండటమే నష్టాలు పెరిగడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ ఉక్కుకర్మాగారం నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు ప్లాంట్ మనుగడ కోసం సెయిల్‌లో విలీన అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను తెలంగాణ కొనుగోలు చేయకుండా కేంద్రం మెలిక..!
janasena : అమిత్‌షాను కలిసి.. విశాఖ ఉక్కుపై భావోద్వేగాన్ని తెలిపాం : పవన్ కల్యాణ్