Central Govt Initiative For Changes in Education System: మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు విద్యా వ్యవస్థలో మార్పులకు కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యావిధానం-2020లో భాగంగా పాఠ్యాంశాలతో పాటు గుణాత్మక, సాంకేతిక అంశాలనూ ప్రాథమిక విద్యా దశలోనే పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు విద్యా వ్యవస్థలో మూలమైన ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల నుంచే మార్పునకు కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా 125 డైట్లకు కేంద్రం నిధులు ఇవ్వగా రాష్ట్రానికి సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు ఎంపికయ్యాయి.
రాష్ట్రంలో మూడు జిల్లా విద్యా శిక్షణ సంస్థలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యావిధానం-2020 కింద ఉపాధ్యాయ విద్య బలోపేతానికి రాష్ట్రానికి నిధులు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 614 డైట్ కళాశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 125 డైట్ కళాశాలలను అభివృద్ధి చేయనుంది. మన రాష్ట్రానికి సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు డైట్ కళాశాలలు ఎంపికయ్యాయి.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మూడు డైట్ కళాశాలల కోసం రూ.24.96 కోట్లు కేటాయించారు. శ్రీకాకుళం కళాశాలకు 7.64 కోట్లు, విజయనగరానికి 9.21 కోట్లు, కర్నూలు కళాశాలకు 8.3 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో మూడు డైట్ కళాశాలలను 18 నుంచి 24 నెలల్లో పూర్తిగా అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది.
సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కార్యక్రమం ద్వారా విజయనగరం డైట్ కళాశాలకు మహర్దశ పట్టనుంది. కేంద్రం కేటాయించిన 9.21 కోట్ల నిధులతో ఈ కళాశాలలో అకడమిక్ బ్లాక్, అదనపు గదులు, గ్రంథాలయం, సెమినార్ హాలు, ప్రత్యేక విద్యా యూనిట్, ఆడిటోరియం, విద్యార్ధుల కోసం వసతిగృహాలు, అధ్యాపకులకు నివాస గృహ సముదాయం సమకూరనుంది. సాంకేతికత పరంగా డిజిటల్, స్మార్ట్ తరగతి గదులు, అంతర్జాల సదుపాయం, ఆడియో, వీడియో పరికరాలు, ప్రత్యేక వెబ్ సైట్ అందుబాటులోకి రానున్నాయి.
సుమారు రూ. 9.21 కోట్లను విజయనగరం డైట్ కళాశాల అభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసింది. కళాశాలలోకి కావాల్సిన మౌలిక సదుపాయాలతోపాటు ఆహ్లదకరమైన వాతావరణం కోసం మైదానానికి కావాల్సిన స్థలం కూడా కేటాయించనుంది. ఈ విషయంలో తామంతా ఎంతో ఆనందిస్తున్నాం. విద్యా రంగంలో డిజిటలైషన్ ద్వారా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కావున అందుకు తగిన విధంగా విద్యను బోధించాలి. చాత్రోపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలంటే అన్ని హంగులతో కూడినటు వంటి వనరులు కావాలి. - తిరుపతి నాయుడు, ఇంఛార్జ్ ప్రిన్సిపల్
వీటికి అదనంగా తాగునీటి కోసం శుద్ధజల కేంద్రం, గ్రీన్ క్యాంపస్, పార్క్, క్యాంటీన్, స్పోర్ట్స్, రిక్రియేషన్ వసతులు కల్పించనున్నారు. డైట్ కళాశాల ఆధునీకరణతోపాటు భద్రత పరంగానూ అభివృద్ధి చేయనున్నారు. కళాశాల మొత్తాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణ పరిధిలోకి తీసుకురానున్నారు. వీటితోపాటు అగ్నిమాపక, ప్రథమ చికిత్స కేంద్రాలూ ఏర్పాటు కానున్నాయి.
విజయనగరం డైట్ కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కార్యక్రమానికి ఎంపిక కావటంపై ఇక్కడి అధ్యాపక బృందంతో పాటు విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ కళాశాలలో అన్ని హంగులు సమకూర్చి బోధకుల కొరత తీర్చకపోతే కేంద్రం లక్ష్యం నెరవేరదంటున్నారు విజయనగరం డైట్ కళాశాల అధ్యాపకులు.
కార్పొరేట్‌కు ధీటుగా విశాఖ మహిళా కళాశాల - Visakha Govt Womens College