Central Government Releases Rs 2800 Crore to Polavaram Project : పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్వాన్సుగా నిధులిచ్చేందుకు కేంద్రం తొలిసారి అంగీకరించడమే కాకుండా, ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమవారం బడ్జెట్ విడుదలకు ఉత్తర్వులిచ్చారు. తొలి విడతగా సుమారు రూ.2,800 కోట్ల మంజూరుకు సమ్మతించారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి ‘అడ్వాన్స్’ పద్దు కింద అందనున్నాయి.
మరోవైపు కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను నవంబరు నుంచి ప్రారంభించేందుకు జలవనరుల శాఖ సిద్ధమవుతోంది. అక్టోబరు చివర్లో లేదా నవంబరు తొలి వారంలో ప్రాజెక్టు వద్దే కీలక సమావేశం జరగనుంది. విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ, ప్రాజెక్టు అధికారులు పాల్గొని సాంకేతిక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ప్రస్తుతం కొత్త డయాఫ్రం వాల్ డిజైన్ రూపకల్పన, నిర్మాణ షెడ్యూలు తయారీలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే ఏడాది జులై నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు.
తొలిదశకు రూ.14,237 కోట్లు అవసరం : పోలవరం ప్రాజెక్టు తొలి దశకు అవసరమైన మేర నిధులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే డీపీఆర్‌ను ఆమోదించింది. అదే సమయంలో అడ్వాన్సుగా ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. గతంలో నాబార్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుని పనులు చేయించేది. గుత్తేదారులకు ఆ బిల్లులు చెల్లించిన తర్వాత అంతే మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం 3.0లో ఈ సంక్లిష్టతను తొలగించారు. కేంద్ర జల్‌శక్తి ప్రత్యేక గ్రాంటులోనే పోలవరానికి నిధులు కేటాయించాలని ప్రతిపాదించినట్లు తెలిసింది.
"రూ.2,800 కోట్లు తీసుకోండి" - పోలవరం పనులకు తొలిసారిగా అడ్వాన్స్ ఇచ్చిన కేంద్రం
కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి తాజాగా సుమారు రూ.2,800 కోట్ల విడుదలకు పచ్చజెండా ఊపారని సమాచారం. మరోపక్క, 2023 మార్చి 31 నాటికి మిగిలి ఉన్న పనుల ప్రకారం తొలిదశ పూర్తి చేయాలంటే రూ.14,237.05 కోట్లు అవసరం. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు రూ.1,287 కోట్ల విలువైన పని చేశారు. ఆ మొత్తం కేంద్రం తిరిగి చెల్లించాల్సి (రీయింబర్స్‌మెంట్) ఉంది. ఇంకా రూ.12,949 కోట్ల విలువైన పని చేయాల్సి ఉందని లెక్కించారు. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.5,931.71 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి ప్రతిపాదనలు పంపింది. పెండింగ్ బిల్లులు, ఈ ఏడాది అవసరాలకు కలిపి తక్షణమే రూ.7,218.68 కోట్లు ఇవ్వాలని కోరింది. ఈ విషయమై సెప్టెంబరులో పీపీఏ, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగాయి.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చేసిన సిఫార్సులను పరిశీలిస్తే.. (నిధులు రూ.కోట్లలో) | ||
అంశం | ప్రభుత్వ ప్రతిపాదన | పీపీఏ సిఫార్సు |
ప్రధాన డ్యాం | 1,509.30 | 1,183.00 |
భూసేకరణ | 1,291.88 | 781.20 |
పునరావాసం | 3,138.53 | 2,269.24 |
పోలవరం అథారిటీ ఖర్చులు | ---- | 36.72 |
పాత బిల్లులు చెల్లింపులకు | 1,218.68 | 571.77 |
మొత్తం | 7,218.68 | 4,841.93 |
డిసెంబరులో అమరావతి పనులు ప్రారంభం - 2027 నాటికి బుల్లెట్ ట్రైన్: సీఎం చంద్రబాబు