Central Government Plans to Merge Visakhapatnam Steel Plant with SAIL : విశాఖ స్టీల్‌ప్లాంటును తిరిగి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేలా కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు మూతపడి, ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న పరిశ్రమను తిరిగి గాడిన పెట్టేందుకు అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం చొరవతో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు 1,324 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని చూపించనున్నాయి. విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్‌ఎండీసీతో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా పరిష్కారం ఆలోచిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, రెండు రోజుల కిందట రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ సైతం విశాఖ పర్యటనలో స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన అంశాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.
1.10 లక్షల కోట్లు ఖర్చు : సెయిల్‌లో విలీనమైతే 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని కేంద్రం చెబుతోంది. దానికి అనుగుణంగా సెయిల్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నుల నుంచి 30 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటోంది. సెయిల్‌కు సంబంధించి ఒక మిలియన్ ఉక్కు ఉత్పత్తి అదనంగా చేయాలంటే ఏడేళ్ల సమయం పడుతుంది. అదే విశాఖ ఉక్కును విలీనం చేసుకుంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో 27.5 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరవచ్చు.
30 వేల కోట్లు ఆదా : సెయిల్‌లో విలీనానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విలీనంతో కనీసం 30 వేల కోట్లు ఆదా కావడంతో పాటు తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం సాకారమవుతుంది. తద్వారా విశాఖ ప్లాంటుకున్న ఇనుప గనుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు టన్నుకు కనీసం 5నుంచి 6 వేల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. భవిష్యత్తులో విశాఖ ఉక్కును మరో 5 మిలియన్ టన్నులకు విస్తరించి, 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
ఉన్నతాధికారులతో భేటీ : విశాఖలోని ఆర్‌ఐఎన్‌ఎల్‌ను నిలబెట్టే ఇతర అంశాలపైనా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సంస్థకు బ్యాంకు రుణం సమకూర్చడం, స్టీలు ప్లాంటు భూముల విక్రయం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్లాంటుకు రుణాలు అందించడంపై చర్చించారు. మరోవైపు ఉక్కు భూముల్లో ఎన్‌ఎండీసీ పెల్లెట్ ప్లాంటు ఏర్పాటుపై సమాలోచనలు సాగుతున్నాయి. పెల్లెట్ ప్లాంటు ఏర్పాటుకు అవసరమైన 1500 నుంచి 2,000 ఎకరాల ఉక్కు భూములను ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.