Four Lane Road In Perecherla And Kondamodu Route : ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పేరేచర్ల-కొండమోడు మార్గానికి మహర్దశ పట్టనుంది. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడం కోసం నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి.పేరేచర్ల-కొండమోడు మార్గం 49.9 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్‌మాల కింద ఎంపిక చేశారు. గతేడాది ఆగస్టులో నిర్వహించిన టెండర్లలో రాజేంద్రసింగ్ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1032.52కోట్ల అంచనాతో దక్కించుకుంది.
అయినప్పటికి నిధులు విడుదల కాక విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై సమీక్షించిన రాష్ట్ర ఆర్‌అండ్‌బీ(R&B)మంత్రి కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీని కలిసి భారత్‌మాల కింద ఉన్న రోడ్లను జాతీయ రహదారుల సాధారణ కార్యక్రమం(ఎన్‌హెచ్‌వో) కింద కొనసాగించాలని కోరారు. చివరికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ స్టాండింగ్ పైనాన్స్ కమిటీ అంగీకరించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈమేరకు ప్రభుత్వం రూ.1032.52కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా రూ.881.61కోట్లకు గుత్తేదారు దక్కించుకున్నారు.
"కొండమోడు-పేరేచర్ల రహదారి నాలుగు వరుసలుగా విస్తరణకు కేంద్రం రూ.881.61 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే టెండరు ప్రక్రియ పూర్తయి గుత్తేదారును సైతం ఎంపిక చేశారు. నెలరోజుల్లోనే పనులు ప్రారంభిస్తారు. భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తయింది. రైతుల ఖాతాలకు నిధులు జమ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం." - లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంటు సభ్యులు, నరసరావుపేట
కొన్నేళ్లుగా ఎదురుచూపులు
గుంటూరు నుంచి హైదరాబాద్ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు మార్గాన్ని విస్తరించాలనేది దశాబ్దాల నాటి కల. ఈ మార్గం అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారితో కొండమోడు వద్ద అనుసంధానమై హైదరాబాద్ వెళ్లేవారికి అనుకూలం. అలాగే గుంటూరు నుంచి పల్నాడు ప్రాంతం వైపు వెళ్లేవారికి కొండమోడు మార్గం కీలకం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు జాతీయ రహదారిగా కేంద్రం గుర్తించింది. గత వైఎస్సార్సీపీ హయాంలో కేంద్రం నిధులు మంజూరు చేసినా వివిధ కారణాలతో విడుదల కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంతోపాటు ఆర్‌అండ్‌బీ(R&B) మంత్రి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలసి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ మార్గం విస్తరణకు గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరణ ప్రక్రియను జిల్లాల యంత్రాంగం పూర్తి చేసింది.
అత్యంత కీలకమైన మార్గం
గుంటూరు నుంచి పల్నాడు, హైదరాబాద్ వెళ్లేవారికి ఇది అత్యంత అనుకూలం. కొండమోడు-పేరేచర్ల మార్గం ప్రస్తుతం 7 నుంచి 10మీటర్ల వెడల్పుతో ఉండటంతో ఎక్కడో ఒక చోట నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గుతుంది. సీఆర్‌డీఏ(CRDA) నిర్మించే బాహ్యవలయ రహదారికి సత్తెనపల్లి వద్ద ఈ మార్గం అనుసంధానమౌతుంది. నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్ 1.5 మీటర్లు, రెండువైపులా మార్జిన్‌లు కలిపి 22.5 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5 కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11 కిలోమీటర్ల బైపాస్ నిర్మిస్తారు.
హైదరాబాద్-బెంగళూరు హైవే విస్తరణ - రాయలసీమకు మహర్దశ - Hyderabad Bangalore Highway
జాతీయ రహదారి విస్తరణలో జాప్యం - కొన్నిచోట్ల కిలోమీటర్ కూడా పూర్తి చేయని కాంట్రాక్టర్లు