Central Committee Visit Machilipatnam: కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండిలోని ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్య శాఖ అధికారుల బృందం పరిశీలించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా, మత్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 970 కిలో మీటర్లు మేర సముద్ర తీర ప్రాంతం ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మెరైన్ ఫిషింగ్‌లో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ఇంకా పాత పద్ధతిలోనే సముద్రంలో వేట సాగిస్తున్నారని తెలిపారు. వేటలో సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరమని స్పష్టం చేశారు.
మత్స్యకారులు, ఆక్వా రంగ అభివృద్ధికై మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరినట్లు మంత్రి వెల్లడించారు. చాలా చేప జాతులు అంతరించిపోతున్నాయని, నూతన చేప జాతులను ఆవిష్కరించాలని అన్నారు. మడ అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికి వేస్తున్నారని, మడ అడవుల పెంపకానికి సహరించాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశామన్నారు.
చిన్న షిప్‌లకు తోడుగా, మత్స్యకారులకు సౌకర్యంగా మదర్ షిప్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని బృందం దృష్టికి తీసుకుని వెళ్లామన్నారు. సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు.
మచిలీపట్నం-రేపల్లె మార్గం కలపాలి: త్వరలో కేంద్ర రైల్వే శాఖా మంత్రిని కలిసి మచిలీపట్నం - రేపల్లె రైలు మార్గం కలిపేలా సహకరించాలని కోరతామన్నారు. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అంచనాలు పెంచి లబ్ధి పొందారు తప్ప, నిర్మాణాలు ముందుకు సాగలేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
"చాలా చేప జాతులు అంతరించిపోతున్నాయి, నూతన చేప జాతులను ఆవిష్కరించాలి. చాలా అరుదైన జాతులు ఉన్నాయి. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలి. మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరాం. చిన్న పడవలు అన్నీ సమద్రంలోకి వెళ్లడం ఒకరోజు అవుతోంది, రావడం ఒకరోజు అవుతోంది. మళ్లీ అక్కడ ఐస్ సరిపోకపోవడం వలన చాలా డ్యామేజ్ జరుగుతోంది. కాబట్టి ఈ ఖర్చుని అంతటినీ తగ్గించడానికి ఒక మదర్ షిప్‌ని పెట్టినట్లైతే, చిన్న బోట్లన్నీ కూడా మదర్ షిప్ దగ్గరకి వెళ్తాయి. తద్వారా వాళ్ల దగ్గర ఉన్న సకరునంతటినీ వారికి ఇస్తారు. అదే విధంగా వారి దగ్గర నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. వాళ్లు వెంటనే పేమెంట్ కూడా ఇచ్చేస్తారు. మదర్ షిప్ కాన్సెప్ట్‌ను తీసుకురావాలని కోరాం". - కొల్లు రవీంద్ర, మంత్రి
కృష్ణాజిల్లాలో త్వరలో మైసూరు బృందావన్ గార్జెన్ తరహా ప్రాజెక్టు - Kollu Ravindra on Manginipudi Beach