Cement Factory Accident Treatment Person Has Dead: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బుధవాడ గ్రామంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రెండో వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాణావతి స్వామి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆవుల వెంకటేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సిమెంట్ తయారీలో భాగంగా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ముడి పదార్థాన్ని పౌడర్‌గా మార్చే కిలెన్ విభాగంలో ట్యాంకు పగలడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
భారతి సిమెంట్ వాహనాలతో అనారోగ్య సమస్యలు - మహిళల ఆందోళన - Protest on Vehicles Dust Problem
ముడి పదార్థాన్ని పంపుతూ వేడి చేసే పైపులైన్ మాదిరిగా ఉండే ట్యాంకు కింది భాగం ఊడిపోయింది. దీంతో 200 డిగ్రీలపైగా వేడితో ఉన్న పొడి కిందకు పడింది. ఇది విధుల్లో ఉన్న కార్మికుల శరీరంపై పడటంతో వారి శరీరమంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలో బాయిల్ పేలుడుతో చుట్టుపక్కల భారీగా పొగలు వ్యాపించాయి. శబ్దం విన్న వెంటనే బూదవాడ గ్రామానికి చెందిన ప్రజలు హుటాహుటిన కర్మాగారానికి చేరుకున్నారు.
కర్మాగారంలోకి గ్రామస్థులు వెళ్లేసరికి లోపల మొత్తం పొగ కమ్మేసి ఉండడం, శరీరం కాలిపోయిన కార్మికుల హాహాకారాలతో ఏం జరుగుతోందో కూడా అర్థంకాని భయానక వాతావరణం నెలకొంది. ఆ తర్వాత బాధితులను ఒక్కొక్కరినీ గ్రామస్థులంతా కలిసి కర్మాగారానికి చెందిన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అక్కడి నుంచి విజయవాడ, మంగళగిరిలోని ఆసుపత్రులకు గ్రామస్థులే తరలించారు.
ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యంతో పాటు కంపెనీ నుంచి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. ప్రీ హీటర్ లోపంతో పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రీ హీటర్‌ను జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందని అన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
అలంకరణ పనికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం - ముగ్గురు కూలీల మృతి - Three died in Road Accident