CCTV Camera for Cleanliness in Hyderabad : సాధారణంగా కొంతమంది చెత్తను చెత్తకుండీలో కాకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై పడేస్తుంటారు. మరికొంత మంది రాత్రి వేళల్లో సంచులతో చెత్తను తీసుకువెళ్లి బహిరంగంగా కనిపించిన ఖాళీ ప్రదేశాల్లో విసిరేసి వెళ్లిపోతారు. వీరందరి ధీమా ఏంటంటే మనల్ని ఎవరేమనరుగా, అయినా నేను చెత్త పడేసింది ఎవరు చూడలేదుగా అని. సాధారణంగా ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే చర్యలు తీసుకుంటుంది. అయినా కొందరు ఇష్టమొచ్చిన చోట చెత్త పడేస్తున్నారు. ఇది గమనించిన సర్కార్ వాళ్ల పనిపట్టేందుకు సరికొత్త ప్లాన్ రెడీ చేసింది. అది ఏంటో తెలుసుకుందాం.
Garbage public places Action in Hyderabad : హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 2,300 చెత్త కుప్పలు ఉన్నాయి. ప్రతి రోజు ఇంటింటికి చెత్త సేకరణ కోసం 4,500 స్వచ్ఛ ఆటోలు వెళ్తున్నాయి. అయినా ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. ఈ చెత్తే భారీ వర్షాలు పడితే నాలాల్లోకి చేరి వరద ఉద్ధృతిని పెంచేస్తోంది. కాలనీలను ముంచెత్తుతోంది. ఇంట్లో చెత్త తీసుకెళ్తే రూ.150 ఇవ్వాలి. వాళ్లు కూడా వారానికి ఒక రోజు వస్తారు. ఈలోపు రాత్రి పూట వెళ్లి రోడ్డు పక్కన చెత్త వేస్తే సరిపోతుందిలే అనుకొని పడేస్తున్న వారి సంఖ్య భాగ్యనగరంలో ఎక్కువగా ఉంది. ఇదే స్వచ్ఛతకు విఘాతం కలిగిస్తోంది.
CC Cameras Installed Public Places Due to Garbage : కొంతకాలంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు సీసీ కెమెరాలతో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిని పట్టుకుంటున్నారు. అనంతరం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మైకుల్లో చెబుతూ హెచ్చరిస్తున్నారు.
ఈ రకంగా నగరంలో ప్రయోగాత్మకంగా ఎల్బీనగర్లోని సర్కిల్లోని ఉప్పల్ చిలకానగర్లో చెత్త కుప్పలను తొలగించి సీసీ కెమెరాలు, మైకులను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ఎవరైతే నియమాలు పాటించకుండా చెత్తను బయటపడేసేవారో వాళ్లకు భయం పట్టుకుంది. దీంతో నగరమంతా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలు, మైకులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను సమీకరించాలని అనుకుంటున్నారు. దీనికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.