Case Against 47 People in Stone Pelting incident Kadapa : వైఎస్సార్ జిల్లా కడప రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధి గౌస్ నగర్లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రాత్రి వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సోమవారం కేసులు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియోలను పరిశీలించి, 47 మందిని గుర్తించారు. అందులో భాగంగా ఉప ముఖ్య మంత్రి అంజాద్బాషాతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన 22 మందిపై, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన 25 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ ఇబ్రహీం తెలిపారు. వారందరికీ 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్నవారిలో చాలా మంది పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు వారి నివాసాలకు వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు.
అంజద్ బాషా సోదరులు పశ్చాత్తాప పడక తప్పదు- మాధవీరెడ్డి హెచ్చరిక - kadapa TDP Candidate
పోలింగ్ రోజు కడప గౌస్నగర్లో జరిగిన అల్లర్లకు సంబంధించి పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి గౌస్నగర్లో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య భారీ స్థాయిలో రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష సైతం వాహనం ఎక్కి తొడలు కొట్టి మీసం మేలేసి ప్రత్యర్థులను పై కేకలు వేయడంతో పరిస్థితి మరింత ఉద్ధృతంగా మారింది. ఈ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సంబంధిత పోలీసు అధికారులకు చార్జిమెమో జారీ చేసిన విషయం విదితమే.
ఈ రాళ్ల దాడికి సంబందించి కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డితోపాటు ఐదుగురు ఎస్ఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. కడప వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సైలుగా పనిచేస్తున్న ఐదుగురిపైన చార్జ్ మెమో జారీ చేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వారందరి పైన శాఖ పరమైన విచారణకు ఆదేశించారు. శాఖా పరమైన విచారణ తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎట్టకేలకు ఘటనుకు సంబంధించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ మరికొందరు పరారిలో ఉన్నట్లు సమాచారం.