Canals Was Ruined Situation in Guntur District: గతేడాది పంటను కాపాడుకునేందుకు ఆలుపెరగని పోరాటం చేసి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ఈసారి వాతావరణ శాఖ నుంచి తీపి కబుర్లు వస్తున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ సాగుకు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పడంతో రైతులు తమ కష్టాన్ని నమ్ముకునేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఏ మేజర్ కాలువను చూసిన ముళ్లచెట్లు, తూటికాడతో అధ్వానంగా ఉండటంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లుగా తూటికాడ, కంపచెట్లతో పూడిపోయిన కాల్వలను శుభ్రం చేయకపోవడంతో ఈ ఏడాది చివరి భూములకు సాగునీరు ప్రశ్నార్థకమేనా అని దిగాలు పడుతున్నారు. పూడికతీత చేపట్టకుండా సాగునీరు విడుదల చేస్తే నీరు అందకపోగా పంట పొలాలు సైతం మునిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొమ్మమూరు కాలువకు నిలిచిన సాగునీరు - ఎండిపోతున్న పంటలు
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరుకే వచ్చే అవకాశం ఉందని, ఆగస్టు- సెప్టెంబర్‌లో అధిక వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణశాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్నదాతలు రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ పనులపై దృష్టి సారించారు. దుక్కులు దున్ని పొలాలను సాగుకు సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే సాగర్, డెల్టా, గుంటూరు ఛానల్ కింద పంట పండించే వేలాది మంది రైతుల కోటి ఆశలకు పంట కాలువలోని పూడిక నీళ్లు చల్లుతోంది.
పంటకాలువలు దుస్థితి చూసిన అన్నదాతలు కాల్వల్లోని తూటికాడ, గుర్రపు డెక్క, కంపచెట్లతో సాగునీరు పారుదల సవ్యంగా సాగే పరిస్థితి లేదంటున్నారు. గుంటూరు, పెదనందిపాడు, నకిరికల్లు, డెల్టాలో ప్రధాన బ్రాంచ్ కాలువల పరిధిలో మైనర్ కాలువలకు పూడిక తీసి, మరమ్మతులు చేయకపోతే పంటను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మురికి కూపాలుగా నీటి పారుదల కాల్వలు - పట్టించుకోని అధికారులు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కాలువలపై కొంత ఆధునికీకరణ పనులను చేపట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో పాలడుగు, నరుకుళ్లపాడు, బండారుపల్లి మేజర్ కాలువల పరిధిలోని వేలాది ఎకరాల్లోని పంటలకు సాగునీరు అందడం లేదు. కాలువలలో నీటి పారుదల సమయంలో ఎక్కువగా నాచు పెరుగుతోంది. దీంతో దిగువకు నీరు పూర్తిస్ధాయిలో సరఫరా కావడంలేదు. దశాబ్దాల క్రితం అమర్చిన షట్టర్లు ధ్వంసమయ్యాయి.
ఆయకట్టుకు నీరందక రైతులు ఇష్టానుసారంగా మేజర్లపై అక్రమ తూములు ఏర్పాటు చేసుకోవడంతో కింద ఉన్న సాగుభూమికి నీరు అందడంలేదు. డ్రెయిన్లు, పూడిక తీతలు తీయాలని రైతులు అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండాపోతోంది. వర్షాలు పడినప్పుడు పొలాల్లో తిష్టవేసే వర్షపు నీరు పారుదల కాక రైతులు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. కాలువల పూడికతీతకు వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని రైతులు మండిపడుతున్నారు.
సత్తెనపల్లి పరిధిలోని అమరావతి మేజర్ కాల్వపై ఉన్న డ్రాప్‌లు శిథిలావస్థకు చేరాయి. గుంటూరు బ్రాంచ్ కెనాల్‌పై కొన్ని ప్రాంతాల్లో కాల్వకట్టలు కోతకు గురయ్యాయి. దీంతో నీరంతా వృథా అవుతుంది. సత్తెనపల్లి మండలంతోపాటు పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల్లో చివరి భూములకు సాగర్ కాల్వ ద్వారా నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేడికొండూరు కాల్వలు పూడిపోయాయి. కొండవీటి మేజర్‌లో ముళ్ల కంచె, పిచ్చికంపతో కాల్వ పూడిపోయింది. తాడికొండ మండలంలోని లాం గ్రామం వద్ద ఉన్న కొండవీటి వాగులో తూటుకాడ దట్టంగా పెరిగిపోయింది. మే నెల సగానికి పైగా అయిపోయినా నేటికీ పూడికతీత పనుల ఊసే కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
షట్టర్లు ఊడుతున్నా పట్టించుకోరే! - వంశధార ప్రాజెక్టు కాలవల దుస్థితిపై అన్నదాతల ఆవేదన